ఖలీల్‌వాడి, మే 31: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉత్తమ వైద్య సేవలు అందించడంలో రాష్ట్రస్థాయిలో ఒక వెలుగు వెలిగిన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో ప్రస్తుతం నిర్లక్ష్యం తాండవిస్తున్నది. పేదలకు వైద్య సేవలు అందించడంలో విఫలమవుతున్నది. ఏడంతుస్తుల మేడలో ఏర్పాటు చేసిన దవాఖాన నిర్వహణపై నీలి నీడలు అలుముకున్నాయి. రోగులకు సేవలు అందించడం అటుంచితే, దవాఖాన భవనం మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారింది. పట్టించుకునే వారు కరువడడంతో రోగులకు భద్రత కరువైంది. దవాఖాన వెలుపలతోపాటు లోపల పగిలిన అద్దాలు దర్శనమిస్తున్నాయి. భారీ వర్షం కురిస్తే చాలు వార్డుల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
జీజీహెచ్‌లో గతంలో ఓ వార్డులో అద్దాలు పగిలిపోయి ఉండడంతో వర్షానికి నీరంతా కిటికీల ద్వారా వార్డుల్లోకి చేరింది. దీంతో రోగులు వారు తెచ్చుకున్న దుస్తులను అడ్డుగా పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా భారీ వర్షం కురిస్తే చాలు కిటికీల నుంచి నీరంతా వార్డులు, ఫ్లోర్‌లోకి వచ్చి చేరుతున్నది. పట్టించుకునే వారు కరువవడంతో ఏండ్లు గడుస్తున్నా లీకేజీలు మాత్రం ఆగడంలేదు. కొంతకాలం క్రితం దవాఖానను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తనిఖీ చేసి, నిధులు మంజూరు చేశారు. మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు. భవనం వెలుపల పైపులైన్ లీకేజీ ఏర్పడడంతో గోడలపై నాచు పేరుకుపోయింది. అటువైపు వెళ్లేవారికి దుర్గంధం వ్యాపించడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. వైద్య కళాశాలలో చదువుతున్న పీజీ స్టూడెంట్లు, ఎంబీబీఎస్ వైద్యులు దుర్వాసన భరించలేకపోతున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జీజీహెచ్‌లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎవరికి వారే యుమునా తీరే అన్న చందంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా వైద్య సేవలు అందించిన జిల్లా ప్రభుత్వ దవాఖాన నేడు ఎవరూ పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారింది. అజామాయిషీ చేసేవారు కరవవడంతో నిర్వహణ గాడి తప్పింది. దవాఖానను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు రోగులకు సేవలుఅందించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రస్తుతం దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ దవాఖానలో అన్ని సిద్ధంగా ఉంచాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా దవాఖానపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
జీజీహెచ్‌లోని మొదటి అంతస్తులో రూం నంబర్ 178లో ఇటీవల పైకప్పు నుంచి పెచ్చులూడాయి. అవి బెడ్‌పై ఉన్న నవజాత శిశువుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన వైద్య సిబ్బంది శిశువును వెంటనే పక్కవార్డులోకి మార్చారు. ఈ ఘటన దవాఖాన నిర్వహణపై నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది.
ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారులే పరిష్కరించాలి. పైకప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయంటే దవాఖాన నిర్వహణలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలను కాపాడుకోవడానికి దవాఖానకు వస్తే ఇలాంటి ఘటనలు జరిగితే భయాందోళనకు గురవుతున్నారు. నిరుపేదలు ప్రభుత్వ దవాఖానలనే ఆశ్రయిస్తారు. వారికి అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలి.
– రమేశ్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ దవాఖానకు సామాన్యులే వస్తారు. వారికి ఎలాంటి వైద్యమైనా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జీజీహెచ్‌లో అన్ని సౌకర్యాలు కల్పించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేవి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునే వారే కరువయ్యారు.
– విజయలక్ష్మి, బీఆర్ఎస్కేవీ జిల్లాకార్యదర్శి