బాన్సువాడ : రైతుల పంటపొలాలకు సాగునీటి ( Irrigation ) ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) కోరారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో నిజాంసాగర్( Nizamsagar) కెనాల్ 26 , 28/1 ఆయకట్టు పరిధిలో రైతులు పంట పొలాలకు నీరు అందడం లేదని పొలాలు ఎండి పోతున్నాయని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
దీంతో నిన్న రాత్రి సుమారు 9 గంటలకు స్వయంగా ఇరిగేషన్ అధికారులను తీసుకొని నిజాంసాగర్ కెనాల్ నంబరు 26 , 28/1 నీటి లెవల్ను పరిశీలించారు. ఆయకట్టులోని చెరువులు, కుంటలు నింపాలని, కెనాల్లో నీటి లెవల్ 3 ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్టులోని ప్రతి గుంటకు నీరు అందేలా చూసే బాధ్యత ఇరిగేషన్ అధికారులదే స్పష్టం చేశారు. ఆయన వెంట తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.