నిజామాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా అధికారులు ఎట్టకేలకు నిద్ర లేచారు. విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా వివిధ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ ‘కోడ్ కూసినా నిద్ర లేవని యంత్రాంగం’ శీర్షికన నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంతో అధికారులు నిద్రమత్తు వీడారు. వివిధ కూడళ్లలో ఉన్న ప్రతిమలకు మంగళవారం ముసుగులు వేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళా రాష్ట్రంలో దాదాపుగా సగానికన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజవర్గానికి, ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వారం క్రితమే జనవరి 29న విడుదలైన షెడ్యూల్‌తో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈసీ నిబంధనల మేరకు పారదర్శక ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలతో సంబంధం కలిగి ఉన్న నేతలు, జాతీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలను ప్రజా బాహుళ్యానికి కనిపించకుండా చేయాలి. ఇందుకోసం వివిధ కూడళ్లలో ఉన్న విగ్రహాలకు ముసుగు వేయాలి. తద్వారా ఓటర్లను ప్రభావితం కాకుండా చూడడం ఈసీ కనీస బాధ్యత. ఈ నిబంధనలు తూ.చ. తప్పకుండా ఆయా జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేశారు. కానీ నిజామాబాద్‌లో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఎన్నికల కోడ్‌తో తమకు సంబంధమే లేదన్నట్లుగా వారం రోజులుగా చేష్టాలుడిగి చూస్తూ ఉండి పోయింది.
నిద్ర మత్తు వీడింది..
ఈ క్రమంలోనే జిల్లా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వారం రోజులుగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్న అంశా న్ని, జిల్లా ఎన్నికల అధికారుల వైఫల్యం, బాధ్యతారాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో నిద్ర లేచిన ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉన్నఫళంగా సిబ్బందిని పురమాయించి నిజామాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న విగ్రహాలకు ముసుగు వేయించారు. జిల్లా అంతటా విగ్రహాలను వస్ర్తాలతో కప్పేయాలని ఆదేశాలిచ్చారు. నిజామాబాద్‌లో ఇద్దరు ఐఏఎస్ అధికారులతో పాటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ), నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్, ముగ్గురు ఆర్డీవోలున్నారు.
కీలక పదవుల్లో ఉన్న వీరందరికీ ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికలకు కరీంనగర్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఉన్నప్పటికీ, జిల్లా లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాల్సిన కనీస బాధ్యత వీరిదే. కానీ వారం రోజుల నుంచి కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోక పోవడంపై వివిధ పార్టీల నేతలు, ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. కావాలనే రెండు జాతీయ పార్టీలకు లాభం చేకూర్చేందుకే నిర్లక్ష్యం ప్రదర్శించారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోడ్ ఉల్లంఘన పేరుతో సామాన్యులను చిత్ర హింసలకు గురి చేసే అధికార యంత్రాంగమే ఇప్పుడు నియమావళిని ఉల్లంఘించిన అంశం లో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా.. లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.