ఎల్లారెడ్డి రూరల్ : సుపరిపాలనకు ప్రతిరూపంగా మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ ( Ahalyabai Holkar) నిలిచిందని కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్, ఆచార్య వంగరి త్రివేణి ( Acharya Wangari Triveni ) అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ , మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇండోర్ మహారాణి అహల్య బాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అహల్య బాయి కృషి ద్వారా వివిధ విభాగాలలో శాశ్వతముద్ర వేసిందన్నారు. విద్య, మహిళ సాధికారత, రాజ్యాంగం వంటి అంశాలను చూసి కాకుండా ఆమె చురుకుదనం, తెలివిని చూసి ఇండోర్ ( Indore ) సంస్థానాధీశులు మల్హరావు హోల్కర్ ఆమెను తన కుమారుడు ఖండేరావు కు ఇచ్చి వివాహం జరిపించారన్నారు. మల్హరావ్ మరణం తర్వాత 1764 నుంచి 1795 వరకు ఇండోర్‌ను దాదాపు మూడు దశాబ్దాల పాటు నిరాటంకంగా పరిపాలించారని వివరించారు.
గొప్ప దాతృత్వం, స్వచ్ఛత, జ్ఞానం ఆమె సొంతమన్నారు. తన సైన్యంలో మహిళా బెటాలియన్ ను సృష్టించారన్నారు. తన కుటుంబ సభ్యులందరూ మరణించినా రాజ్యమే తన కుటుంబం గా భావించి అద్భుతమైన పాలన అందించారని పేర్కొన్నారు. రాణి అహల్యాబాయి హోల్కర్ స్వయం వ్యక్తిత్వం, శక్తియుక్తులు, కార్య సాధన వంటివి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, అధ్యాపకులు శంకరయ్య, నాగనిక, రాణి, సిద్దు రాజు, చంద్రకాంత్, కిరణ్, సంతోష్, సంగీత, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.