కోటగిరి/బిచ్కుంద/రామారెడ్డి/బోధన్, ఏప్రిల్ 16: ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాలు రసాభాసగా మారాయి. కాంగ్రెస్ హామీల అమలు, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు, ప్రజల నిరసనలు, నిలదీతలతో ఉద్రిక్తతకు దారి తీశాయి. కోటగిరిలో స్థాయి సభ ప్రారంభం కాగానే హామీల అమలుపై అన్నదాతలు ప్రశ్నించారు. రైతుభరోసా ఏదీ..? ఎప్పుడిస్తారు? అసలు ఇస్తారా.. ఇవ్వరా? అని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు.. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
బిచ్కుందలో ఎంపీడీవో గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి సమావేశం గందరగోళంగా మారింది. మైక్‌సెట్ సరిగా పని చేయక అధికారులు చెప్పేది అక్కడున్న వారికి అర్థం కాక ఇబ్బంది పడ్డారు. మరోవైపు, తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు తమ వార్డును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మొఖం చాటేశాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే చేస్తానన్న అభివృద్ధి ఏదని ప్రశ్నించారు. మురికి కాలువలు అధ్వానంగా మారాయని, తాగునీటి సమస్య ఉన్నదని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.
రామారెడ్డిలో నిర్వహించిన మండల సభలోనూ అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులు సైతం రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. కొంత మంది అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై రుసరుసలాడారు. ఆయా అధికారులపై చర్య లు తీసుకోవాలని, లేకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కేటాయించడం లేదని, కాళేశ్వరం ఇసుకను కొనుగోలు చేసుకుని తీసుకొస్తున్న ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేయడంపై సర్పంచులు మండిపడ్డారు.