బాన్సువాడ రూరల్, జూన్ 10 : అడవులను కాపాడుకోవడం సామాజిక బాధ్యత అని సర్పంచ్ మంద సంగమేశ్వర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని కిమ్యానాయక్ తాండలో బుధవారం ఆటవిశాఖ ఆధ్వర్యంలో అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వాల్టా చట్టం, వణ్యప్రాణుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అడవులను నరకడం, ఆటవీ భూములు కబ్జా చేయడం చట్టరీత్యా నేరమన్నారు.
అడవులను నరకడం వల్ల పర్యావరణం కలుషితమై సకాలంలో వర్షాలు కురవక కరువు, కాటకాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ స్వాతి అటవీ సంరక్షణ చట్టం – 1967, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లపై గ్రామస్తులకు వివరించారు.