వినాయక నగర్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి( SHO Raghupati ) వెల్లడించారు. ఓ వ్యక్తి తన బ్యాగులో గంజాయి తరలిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి రంగంలోకి దింపినట్టు ఆయన తెలిపారు.
ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న నవీపేట మండలం నాళేశ్వరం గ్రామానికి చెందిన బీస ప్రవీణ్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా 250 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రస్తుతం అతడు నిర్మల్ జిల్లా తాండూర్ మండలం ఎలవాత్ గ్రామంలో ఉంటున్నట్లు విచారణలో అంగీకరించాడని తెలిపారు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన వన్ టౌన్ ఎస్ఐ మొగులయ్య, సిబ్బందిని అధికారులు అభినందించారు.