నిజామాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / మాక్లూర్: మాతృభూమి రక్షణలో ఆ గ్రామం తరిస్తున్నది. దేశ సేవ కోసం గ్రామంలోని యువత అంకితమవుతున్నది. జవాన్ల గ్రామంగా పేరుతెచ్చుకొని ఆదర్శ పల్లెగా నిలుస్తున్నది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామం. జాతీయ రహదారి వెంట ఉన్న మామిడిపల్లిలో 20 ఏండ్లలో ఇప్పటి వరకు 14 మంది ఆర్మీ ఉద్యోగాల్లో రాణించారు. జవాన్‌గా ఎంపికై వివిధ హోదాల్లో దేశ సేవలో తరించారు. కొంత మంది సర్వీస్ పూర్తి చేసుకుని ఇంటి రాగా, మరికొంత మంది ఇప్పటికీ దేశ సేవలో ఉన్నారు. ఆర్మీ ఉద్యోగాలంటే ఈ ప్రాంతంలో ఎంతో ఆసక్తి చూపుతుంటారు. చాలా మంది ఇంటర్ అయిపోగానే సంప్రదాయబద్ధంగా డిగ్రీలు, పీజీలు లేదంటే ఇంజినీరింగ్ చదువుతారు. కానీ ఈ ప్రాంత యువకులు చాలా భిన్నం.
యుక్త వయసులో ఆర్మీ ఉద్యోగాల కోసం పోటీపడడం వీరి నైజం. జవాన్‌గా దేశ సేవలో నిమగ్నమైన ఎంతో మందిని స్ఫూర్తిగా తీసుకుని మామిడిపల్లిలో పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను సైతం చాలా మంది సాధించారు. ప్రభుత్వ సేవల్లో భాగమై ప్రజలకు సేవలు అందిస్తున్నారు. పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఈ ప్రాంతంలోని మాజీ సైనికులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ పోరులో భారత్‌దే పైచేయి అంటూ గర్వంగా చెబుతున్నారు. పాకిస్థాన్ పీచమణిచే సమయం ఆసన్నమైందంటున్నారు. భారత్‌తో పోరుకుసిద్ధమైన పాకిస్థాన్‌కు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.
ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దులో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశ సేవ చేస్తూ తమ ఊరికే కాక జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు మామిడిపల్లి గ్రామ యువకులు. అడవి మామిడిపల్లి నుంచి 21 ఏండ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 14 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. ఈ గ్రామాన్ని అడవి మామిడిపల్లి అని కాకుండా జైహింద్ మామిడిపల్లి, ఆర్మీ మామిడిపల్లి అని పిలుస్తుండడం విశేషం. ఇక ఊరిలోకి అడుగు పెట్టగానే స్వామివివేకానంద విగ్రహం, ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశ భక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతోపాటు తమ బిడ్డలకు దేశరక్షణ కోసం సరిహద్దుల్లో పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడం అతిశయోక్తి కాదు.
మామిడిపల్లి గ్రామం ఇప్పుడు ఎంతో మంది స్ఫూర్తి కేంద్రంగా మారింది. సాధారణంగా ఇంటర్, డిగ్రీ చదివే సమయంలో సినిమాలు, షికార్లు అంటూ టైం పాస్ చేయడం చూస్తుంటాం. ఈ గ్రామంలో ఆర్మీ ఉద్యోగానికి అర్హత వస్తే దరఖాస్తు చేసి పరీక్షలకు సన్నద్ధమవుతారు. ఆర్మీలో చేరేందుకే ఎక్కువ మంది పోటీ పడుతారు. వివిధ కారణాలతో ఆర్మీలో జాబ్ చేజారితే కనీసం పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడడం ఇక్కడ కనిపిస్తుంది. ఈ గ్రామంలో పదుల సంఖ్యలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు సంపాదించిన వారున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారితో కలిపి మొత్తం 50 మంది వరకు ఉండడంతో ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది. వివేకానందుడు, అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తూ, వారు చూపిన మార్గంలో నడుస్తున్నది.
పాకిస్థాన్‌పై భారత్ కొనసాగిస్తున్న ఈ పోరులో ముమ్మాటికి మనదే పైచేయి ఉంటుంది. శక్తియుక్తుల్లో పాకిస్థాన్‌కు ఎలాంటి బలాలు లేవు. మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తున్నది. జమ్ములో అనేక గడ్డు పరిస్థితులను నేను స్వయంగా ఎదుర్కొన్నాను. జవాన్ నుంచి హవల్దార్ వరకు పని చేశాను. నేను పని చేసిన సమయంలో నిత్యం ఘర్షణ పూరిత వాతావరణం ఉండేది. చాలా దీటుగా ఎదుర్కొనేవాళ్లు.
– వంజరి రవీందర్, ఆర్మీ మాజీ జవాన్, మామిడిపల్లి
దేశ సేవలో ప్రాణాలకు తెగించి కొట్లాడడం మాటలు కాదు. జవాన్ నుంచి వివిధ హోదాల్లో, వివిధ సందర్భాల్లో పోరాటం చేసే అవకాశం నాకు దక్కడం గర్వంగా ఉంటుంది. పంజాబ్, అస్సాం, జమ్ముకశ్మీర్, ఢిల్లీ, హైదరాబాద్‌లో జవాన్‌గా పనిచేశాను. కశ్మీర్లో పని చేసిన రోజులను మరిచి పోలేను. పాకిస్థాన్‌తో ఇప్పుడు జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో రోజుల వ్యవధిలోనే భారత్ విజయం సాధిస్తుంది. పాకిస్థాన్‌కు భారత్‌తో ఢీకొనే శక్తి లేదు.
– జానకీరామ్, ఆర్మీ మాజీ జవాన్, మామిడిపల్లి
పాకిస్థాన్‌కు సరైన జవాబు ఇచ్చే ఏకైక దేశం భారత్ మాత్రమే. ఇంకోసారి మన దేశంతో తలపడాలంటే వణికి పోయే పరిస్థితిని పాకిస్థాన్ ఎదుర్కొంటుంది. నేను సుదీర్ఘ కాలం పంజాబ్, రాజస్థాన్, నాగాలాండ్, జమ్ము, అస్సాం, ఢిల్లీ, సికింద్రాబాద్‌లో పని చేశాను. సిపాయిగా ఎంపికై లాన్స్ నాయక్, నాయక్‌గా ఉద్యోగోన్నతి పొందాను. హవల్దార్‌గా పని చేసిన.
– కేతావత్ రవీందర్, ఆర్మీ మాజీ జవాన్, మామిడిపల్లి