సారంగాపూర్, మే 13: ‘కాంగ్రెస్ సర్కారు అచ్చినంక ఏది కూడా సక్కగా ఇచ్చింది లేదు..కేసీఆర్ సార్ పాలననే బాగుండే..’ అంటూ రూరల్ మండలంలోని మల్కాపూర్ తండా మహిళలు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎదుట గుర్తుచేసుకున్నారు. మల్కాపూర్‌లో తండాలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి తండావాసులు, పలువురు మహిళలతో ముచ్చటించారు.
పదేండ్ల కేసీఆర్ పాలన ఎలా ఉం డే..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన ఎలా నడుస్తున్నదని వారిని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు అమలు చేస్తున్నారా అని అడుగగా..ఇచ్చిన హామీని ఒక్కటి కూడా అమలుచేసిందిలేదంటూ కొందరు మహిళలు అసహనం వ్యక్తంచేశారు. కేసీఆర్ సార్ పాలననే బాగుండెనని గుర్తుచేసుకొన్నారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బాజిరెడ్డి పేర్కొన్నారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని ధీమా వ్యక్తంచేశారు.బాజిరెడ్డి వెంట బీఆర్ఎస్ యువ నాయకుడు బాజిరెడ్డి జగన్, పార్టీ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, మాజీ వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, నాయకులు ప్రేమ్‌దాస్, గోపాల్ ఉన్నారు.