గాంధారి/బీబీపేట్, డిసెంబర్ 26 : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి సమీపంలోని చెరువులో భిక్కనూర్ ఎస్సై సాయికుమార్‌తోపాటు బీబీ పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రుతి (33), మరో యువకుడు నిఖిల్ మృతిచెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం శ్రుతి మృతదేహాన్ని స్వగ్రామం గాంధారికి, నిఖిల్ మృతదేహం బీబీపేటకు తరలించగా.. కుటుంబ సభ్యులు గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, ఎల్లారెడ్డి సీఐ రవీంద్రనాథ్, గాంధారి ఎస్సై అంజనేయులు శ్రుతి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. అంతిమయాత్రలో తోటి ఉద్యోగులతోపాటు స్నేహితులు పాల్గొన్నారు.
మండలంలోని గుర్జాల్ గ్రామానికి చెందిన కమ్మరి పుండరీకం, విజయ దంపతులకు ఇద్దరు కూతుళ్లు (శ్రుతి, శ్వేత), ఒక కొడుకు (నవీన్) ఉన్నారు. 20 ఏండ్లుగా గాంధారి మండల కేంద్రంలోని నరేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి పుండరీకం కుల వృత్తి చేస్తుండగా, తల్లి బీడీలు చుడుతూ పిల్లలను చదివించారు. పుండరీకం పెద్ద కూతురు శ్రుతి 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి గాంధారి పోలీస్ స్టేషన్లో ఆరేండ్లపాటు పనిచేసింది. బదిలీపై కామారెడ్డిలో ఏడాది, మూడేండ్లుగా బీబీపేట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న శ్రుతి మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెది ఆత్మహత్య కాదని, ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు.
రామారెడ్డి, డిసెంబర్ 26: భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ ఎస్సై రంజిత్ తెలిపారు.