జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్‌లో గాంధీ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కామారెడ్డిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిజామాబాద్, అక్టోబర్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహాత్మా గాంధీ జీవితం అన్ని తరాలకు ఆదర్శం. ఆయన మాటలు అనుసరణీయం. బాపు చూపిన మార్గం శిరోధార్యం. మన దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన జాతిపితగా ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన జయంతి రోజున సోషల్ మీడియాలో వికృత చేష్టలు రాజ్యమేలాయి. మహాత్ముడిపై అనుచితంగా పోస్టులు పెడుతూ కొంతమంది వ్యక్తులు వికృత క్రీడకు తెర లేపారు. మహనీయుడి జయంతిని పురస్కరించుకుని దేశమంతటా, ప్రతి వాడలోనూ గాంధీజీ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళ్లు అర్పించగా.. కొంతమంది తీరు మాత్రం ఆక్షేపణీయంగా మారింది.
మహాత్ముడి సేవలను కొనియాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళ్లు అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు వాట్సాప్‌ల్లో మాత్రం అక్టోబర్ 2 ఉదయం నుంచే విద్వేషాన్ని పెంచి పోషించేలా కొంత మంది పెట్టిన పోస్టులు వివాదానికి దారితీశాయి. ఉదయం 8గంటలకే దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించగా.. కొంత మంది చిల్లర పోస్టులతో చెడు ప్రచారానికి ఒడిగట్టడంపై ప్రజాస్వామ్య వాదులందరూ తప్పు పడుతున్నారు. చెడు భావజాల వ్యాప్తితో సమాజంలో ఉద్రిక్తతలకు తావిచ్చేలా వ్యవహరించే వ్యక్తులు, శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
స్వాతంత్య్ర సమరంలో గాంధీ చూపిన అహింసా మార్గం యావత్ ప్రపంచానికి చుక్కానిగా నిలిచింది. తెలంగాణ ఉద్యమం సైతం కేసీఆర్ సారథ్యంలో అహింసాయుతంగానే నడిచింది. హింసను ప్రోత్సహించకుండా శాంతియుత పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర సాధన పోరు జరగడం వల్లే విజయ తీరాలకు చేరింది. గాంధీ చూపిన శాంతి మార్గాన్ని అనుసరిస్తూ గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీనగర్ కాలనీవాసులు బుధవారం నిరసన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
శ్రీనగర్ కాలనీలో పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారమార్గం కోరుతూ నిరసన బాట పట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బీటీ రోడ్డు సౌకర్యం, కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు చేపట్టాలని నిరసనదీక్ష చేపట్టారు. సమస్యల పరిష్కారం కోరుతూ చాలా రోజులుగా ప్రజలంతా విన్నపాలు విన్నవిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగంలో చలనం కరువైంది. దీంతో గాంధీ జయంతి రోజునే శ్రీనగర్ కాలనీ వాసులంతా కలిసి శాంతి యుతంగా నిరసనకు దిగారు. గాంధీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ ఆందోళలను కొనసాగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
వినాయక్‌నగర్/ కామారెడ్డి/శక్కర్‌నగర్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా మద్యం, మాంసం విక్రయాలు కొనసాగాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకేంద్రాల్లోని పలుప్రాంతాల్లో మాంసం విక్రయించారు. గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. కామారెడ్డిలో మాంసం దుకాణాల వద్దకు వెళ్లి చెప్పినప్పటికీ యజమానులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సుజాత పోలీసులతో వెళ్లి మాంసం విక్రయ దుకాణాలను మూసివేయించారు.
బోధన్ పట్టణ శివారులో పలు చికెన్ సెంటర్లు తెరిచి ఉంచారు. దీనిపై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా..వారు పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు.విక్రయానికి సిద్ధంగా ఉంచిన చికెన్‌పై ఫినాయిల్ చల్లి పనికిరాకుండా చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు, పోలీసులు హెచ్చరించారు. గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం విక్రయాలు జరుపవద్దనే నిబంధనలు ఉన్నా.. వాటిని తుంగలోకి తొక్కి కొన్నిచోట్ల విక్రయాలు బాహాటంగా నిర్వహించారు.