నవీపేట, జనవరి 22 : తెలంగాణలో దేశంలోనే ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని మహారాష్ట్ర నాయకులు కోరారు. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావును కోరారు. ఈ మేరకు నాందెడ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కమిటీ చీఫ్ కన్వీనర్ గంగాధర్ పటేల్ అధ్వర్యంలో 30 గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు మండలంలోని జన్నేపల్లి గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యేను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ పోటీ చేయాలని కోరారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా..
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ, సంక్షేమ పథకాల అమలు ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మహారాష్ట్ర నాయకులకు ఎమ్మెల్యే మైనంపల్లి హామీ ఇచ్చారు. అక్కడి ప్రజల అభిప్రాయాలను పార్టీ అధినేతకు వెల్లడిస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారని, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం బీఆర్ఎస్కు పూర్తి మద్దతు తెలిపారని గుర్తుచేశారు. త్వరలోనే పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
కేసీఆర్ ఎజెండానే తమ ఎజెండా అని అన్నారు. నవీపేట మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తెడ్డు పోశెట్టి తల్లి ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే పరామర్శించారు. మైనంపల్లిని కలిసినవారిలో నాండెడ్, దెగ్లూర్, బిలోలి, ఇబ్రహీంపేట్, ఖండ్గావ్, ధర్మాబాద్, నాయ్‌గావ్, ఏస్గి తదితర గ్రామాల నాయకులు వెంకట్రావు, పాండే తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెడ్డు పోశెట్టి, దొంత ప్రవీణ్‌కుమార్, సూరిబాబు, మోహన్ ఉన్నారు.