ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 11న నిజామాబాద్ ధర్నా (Mahadharna) చౌక్‌లో నిర్వహిస్తున్న మహా ధర్నారు విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఐక్య రైతు సంఘం ( AIUKS ) రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం ( Devaram ) పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోదీ( Narendra Modi ) రైతాంగానికి ఇచ్చిన హామీలపై నిలదీయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు చట్టాల స్థానంలో జాతీయ వ్యవసాయ మార్కెట్ ముసాయిదాను తీసుకొచ్చిందని దీనిని రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడుతామని అన్నారు. రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం ద్వారా కనీన మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వడంలో స్పష్టత లేకపోవడం రైతుల భద్రతకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది రైతుల ఆదాయ భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అన్నారు.
కేంద్రం కాంట్రాక్ట్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందని, దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం పై పట్టుకోల్పోయి కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని దేవరాం అన్నారు. ఈ సమావేశంలో అఖిలభారత ఐక్య రైతు సంఘంజిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న, గంగారం, కిషన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు .