ఇందల్వాయి , జూలై 8 : మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్లు ధ్వంసం కాగా.. పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ముందు వెళ్తున్న రెండు కార్లను వెనుక నుంచి వస్తున్న ఓ లారీ అదుపు తప్పి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ముందు వెళ్తున్న కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనగా..అందులో ప్రయాణిస్తున్నవారికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదానికి గురైన కారు తగిలి బైక్‌పై వెళ్తున్న కామారెడ్డి జిల్లా ఉత్తునూరు గ్రామానికి చెందిన దంపతులు రోడ్డు పక్కన పడిపోవడంతో వారికి కూడా గాయాలయ్యాయి. రోడ్డుపై కార్లు, లారీ నిలిచిపోవడంతో మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కార్లను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. క్షతగాత్రులను టోల్‌ఫ్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్ దవాఖానకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.