వినాయక నగర్ : ప్రజల ఆకాంక్షల మేరకు లోక కళ్యాణార్థమే లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల (District Judge Sunitha Kunchala) అన్నారు. ఈ నెల 8న జాతీయ లోక్‌అదాలత్‌ను ( National Lok Adalat) నిర్వహిస్తున్నామని తెలిపారు.
గురువారం నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణంలో న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి ( Civil Judge Padmavati ) తో కలిసి మాట్లాడారు. ప్రజలందరికీ న్యాయవిజ్ఞానాన్ని అందించడంలో సంస్థ తనవంతు కృషి చేస్తున్నదని అన్నారు. పోక్సో క్రిమినల్ (POCSO criminal cases ) కేసులలో బాధితులకు ఆర్థికంగా అండగా నిలిచామని పేర్కొన్నారు.
హత్యకేసులలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు ఆర్థిక పరిహారాన్ని అందించి వారి భవిష్యత్తు భద్రతకు భద్రమైన పునాధిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ నాల్సా ప్రోత్సాహం,ప్రేరణనే స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. మహిళ సాధికారతకు సంస్థ చేదోడుగా నిలిచిందని అన్నారు. జిల్లాలో బాలికల స్వయం భద్రతకు బాటలు వేశామని,ఆత్మరక్షణకు అవసరమైన మేరకు శిక్షణ ఇప్పించడం న్యాయసేవ సంస్థ కీర్తి కిరీటంలో కలికి తురాయిగా నిలిచిపోతుందని జిల్లాజడ్జి అన్నారు.
రాజీపడదగిన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ దావాలు వీలైనంత వరకు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం లీగల్ అవేర్ నెస్, మాడ్యూల్ క్యాంప్‌లను జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.