క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసుశాఖలో కొందరి వ్యవహారశైలి ఆ శాఖ పరువును బజారుకీడుస్తున్నది. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ ఏసీపీ స్థాయి అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సెటిల్మెంట్ల దందాకు తెరలేపినట్లు సమాచారం. ఏకంగా నగరంలోని ఓ హోటల్లో తిష్టవేశాడు. ఏసీ గదిని ఖాకీ పేరుతో అద్దెకు తీసుకొని అక్కడి నుంచే రాచకార్యాలు వెలగబెట్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు అధికారి హోటల్‌కు గుడ్‌బై చెప్పి అక్కడి నుంచి ఓ కిరాయి ఇంట్లోకి మకాం మార్చాడు. ఇంతచేసినా సదరు ఏసీపీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
గడిచిన ఏడాది కాలంలో చాలా మంది ఖాకీలు శాఖాపరమైన చర్యలకు బలికాగా.. చిన్నపాటి నిర్లక్ష్యానికి మెమోలు, సస్పెన్షన్లు, బదిలీలు, అటాచ్మెంట్లు ఇలా నానా రకాలుగా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. హోంగార్డుల నుంచి పైస్థాయి వరకు అంద రూ మిన్నకుంటూ పనిచేసుకుంటూ పోతున్నా రు. నిర్లక్ష్యం జరగకుండా, తప్పులు వెలుగు చూడకుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ శాంతి, భద్రతల పరిరక్షణలో నిమగ్నమవుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ సలాం కొడుతున్నారు.
పోలీసులు తమ పనితాము చేసుకుంటుండగా.. కమిషనరేట్‌లో ఓ ఏసీపీ స్థాయి పోలీస్ అధికారి తీరు తీవ్ర దుమారం రేగుతోంది. ఉన్నత స్థాయిలో ఉన్న సదరు అధికారి ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ సదరు అధికారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కింది స్థాయిలోని ఖాకీలు అనుకోకుండా తప్పు చేస్తే తీవ్రమైన దండన వేస్తున్న ఉన్నతాధికారులు.. సదరు ఏసీపీపై మిన్నకుంటూ పోవ డం ఏమిటంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏసీపీ బస చేసిన హోటల్లోనే ఈ మధ్య దాడులు జరిగాయి. హైటెక్ వ్యభిచారం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూశాయి. ఒక్కసారిగా నగర వాసులు హతాశులయ్యారు. హోటల్ యాజమాన్యం బరితెగింపునకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సదరు ఏసీపీ అభయమే అని ప్రచారం జరుగుతోంది. తాను ఈ హోటల్లో ఉండగా ఎవరూ దాడి చేయలేడంటూ చెప్పుకోవడంతో సదరు హోటల్ యాజమాన్యం కూడా విచ్చలవిడిగా గదులను కిరాయికి ఇచ్చి దందాను నడిపించినట్లు సమాచారం. నిఘా వర్గాల ద్వారా అసలు తంతును పోలీస్ ఉన్నతాధికారి తెలుసుకోవడంతో ఏసీపీ బస చేసిన హోటల్‌పైనే దాడి చేయించాడు.
ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించి అత్యంత రహస్యంగా హోటల్‌పై దాడి చేయించి అసాంఘిక కార్యకలాపాల గుట్టును రట్టు చేయించాడు. విషయం తెలుసుకున్న సదరు అధికారి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. హోటల్లో తాను చేస్తున్న ఆగడాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించిన విషయాన్ని గ్రహించి, చేసేది లేక తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీలు సైతం కమిషనరేట్ ఉన్నతాధికారికి చేరాయి. పలు సెటిల్మెంట్లు జరిగినట్లు వినికిడి. ఏసీపీ నేతృత్వం వహిస్తున్న విభాగంలోని కానిస్టేబుళ్లు సైతం సదరు అధికారి తీరుతో విసుగు చెందుతున్నట్లు సమాచారం. ఇందులో పనిచేస్తున్న ఒకరిద్దరు కూడా ఏసీపీ తీరును చూసి గాడి తప్పుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఆ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన పెరుగుతోంది.
ఉద్యోగ విధుల్లో భాగంగా ఏ అధికారి అయినా సొంతంగా గూడును సర్దుబాటు చేసుకోవడం పరిపాటి. స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా వెసులుబాటు కల్పించుకుంటారు. కమిషనరేట్‌లో ఓ విభాగానికి ఏసీపీగా వచ్చిన అధికారి మాత్రం ఇందుకు విరుద్ధం. తాను ఏసీపీ ర్యాంకు అధికారిని అనే భావనతో నగరంలో పేరు మోసిన హోటల్‌పై కన్నేశాడు. ఖాకీ పేరుతో ఒక ఏసీ గదిని తీసుకొని, దానిని తన ఇంటి గదిగా మార్చుకుని అందులో తిష్టవేశాడు. ఇలా రోజుల తరబడి సదరు అధికారికి హోటల్ యాజమాన్యం కూడా సౌకర్యాలను కల్పిస్తూ వచ్చింది. నయా పైసా లేకుండా రాచమర్యాదలు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తంచేయడంతో సదరు అధికారి హోటల్ గదిని ఖాళీ చేశాడు. ముబారక్‌నగర్ వెళ్లే దారిలో ఓ ఇంట్లో అద్దెకు దిగి వసతి పొందుతున్నాడు. ఇన్నిరోజుల పాటు ఖాకీ యూనిఫాం పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాచ మర్యాదలు పొందిన విషయం .. పోలీసు ఉన్నతాధికారికి తెలిసేసరికి ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏసీపీ స్థాయి అధికారికి స్థానిక ఠాణా పోలీసులు సైతం వంత పాడడం గమనార్హం. హోదాకు గౌరవం ఇచ్చి భయంతో వణికి పోతూ మర్యాదలకు కొదువ లేకుండా చూశారు. జిల్లాకు వచ్చిన కొత్తలో ఏడో బెటాలియన్‌లోనూ ఆశ్రయం పొందినట్లు సమాచారం. ఓ ఉన్నతాధికారి జోక్యం చేసుకొని నోటీసులు జారీ చేయడంతో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది.
పోలీస్ కమిషనరేట్‌లో డయల్ -100 నంబర్‌కు సరైన సమాధానం ఇవ్వకపోతే ఓ ఎస్సై తన పోస్టును పోగొట్టుకున్నాడు. చివరకు ఓ ఠాణాలో మరో ఎస్సై సైతం ఎఫ్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యం, జాప్యం వెలుగు చూడడంతో అటాచ్ చేయబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవడంతో కమిషనరేట్‌లో భయం పట్టుకున్నది. క్రమశిక్షణా చర్యలు ఎక్కువివ్వడంతో పనితీరులో పారదర్శకత రెట్టింపు అయ్యింది.
అయితే సామాన్య ఖాకీలపై ఎడాపెడా చర్యలు తీసుకునే ఉన్నతాధికారులకు ఏసీపీ స్థాయి అధికారుల లీలలు బాహాటంగానే కనిపిస్తున్నప్పటికీ శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం ఏమిటి? అంటూ కింది స్థాయిలోని పోలీస్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. తమకో న్యాయం, ఉన్నతాధికారులకో న్యాయమా? అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హెల్మెట్ లేకపోతేనే రూ.130 చలానా ఇంటికి పంపించి వేధించే ఖాకీలకు.. సొంత శాఖలో అరాచకాలు కనిపించడం లేదా? అని ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.