నిజామాబాద్, మే 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆమ్చూర్ రైతులకు గతేడాది లాగే ఈసారి కూడా కష్టాలు వెంటాడుతున్నాయి. అనుకున్న స్థాయిలో ధర లేక మామిడి పంటపై ఆధారపడి జీవిస్తోన్న అనేక కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. మధ్యవర్తుల దోపీడి వల్ల ఆమ్చూర్ రైతులకు నష్టాలు తప్పడం లేదు. రోజుకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సుమారుగా 500 నుంచి 700 క్వింటాళ్లు ఆమ్చూర్ వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా మహారాష్ట్ర నుంచి కూడా ఆమ్‌చూర్‌ను ఇక్కడికి తీసుకు వస్తున్నారు. క్వింటాకు రూ.35వేలు ధర పలికితే గిట్టుబాటు దక్కుతుంది. కానిప్పుడు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం మూలంగా నష్టాలు తప్పడం లేదు.
తూతూ మంత్రంగా 10 నుంచి 15 క్వింటాళ్ల వరకే మంచి ధరను కల్పిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పట్టికలో అద్భుతమైన ధరగా చిత్రీకరిస్తున్నారు. గరిష్ట ధర రూ.35వేలకు పైగానే చూపిస్తున్నారు. కానీ ఇదీ కొద్ది మందికే వర్తిస్తోంది. వందల క్వింటాళ్లలో 20 క్వింటాళ్లకే మంచి ధర కల్పించి మిగిలిన వారందరికీ బొటాబొటిన ధరను అందిస్తున్నారు. తద్వార వ్యాపారులు తెలివిని ప్రదర్శిస్తూ మాయాజాలం సృష్టిస్తున్నారు. రూ.20వేల నుంచి రూ.25వేలు వరకే ఎక్కువ మందికి గిట్టుబాటు దక్కుతుండగా కనిష్ట ధర రూ.9వేలుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పేర్కొంటోంది.
దోపిడీకి గురవుతోన్న ఆమ్చూర్ రైతులు
గడిచిన 20 రోజులుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సుమారుగా 15వేల నుంచి 20వేల క్వింటాళ్లు ఆమ్చూర్ వచ్చింది. ఆమ్చూర్(మామిడి వరుగు పొడి)గా పేర్కొనే ఈ అరుదైన పంట క్రయ, విక్రయాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఏకైక మార్కెట్ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నిలుస్తోంది. అనేక జిల్లాల నుంచి నిజామాబాద్‌కు ఆమ్‌చూర్‌ను అమ్ముకునేందుకు మామిడి రైతులు వేసవి కాలంలో వస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఇక్కడ అందుబాటులో ఉన్న ధరలకు ఆమ్‌చూర్‌ను అమ్ముకోవడం తప్పా వేరే ప్రత్యామ్నాయ మార్గమే లేదు. వాహనాలను అద్దెకు తీసుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చి రోజుల తరబడి వేచి చూడటం ఆమ్చూర్ రైతులకు భారంగా మారుతోంది.
ఆశించిన ధరను వ్యాపారులు ఇవ్వకపోవడంతో చేసేది లేక వేచి ఉండలేక ఎంతో కొంతకు బేరం ఆడుకుని ముట్టజెప్పాల్సి వస్తోంది. పోటీ వాతావరణం అన్నది లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. వ్యాపారుల్లో ఆమ్‌చూర్‌ను సేకరించే వారంతా కొద్ది మందే ఉన్నారు. వీరంతా సిండికేట్‌గా మారి రైతులను నష్టాలకు గురి చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. గిట్టాబాటు ధర దక్కడం లేదని ఆమ్‌చూర్‌తో వెనక్కి వెళ్తే వాహన కిరాయి అదనపు భారంగా మోయాల్సి వస్తోంది. వ్యాపారులు కోట్ చేసే ధరలకే ఆమ్‌చూర్‌ను నోరెత్తకుండా అమ్ముకోవాల్సిన దుస్థితితో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

నిఘా పెట్టని మార్కెటింగ్ శాఖ..
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు మే మాసంలో మాత్రమే ఆమ్చూర్ వస్తుంది. రైతులు తెచ్చిన సరుకును కుప్పలుగా పోసి లాట్ నంబర్లను తీసుకుని కుప్పలపై పెడతారు. తద్వార వ్యాపారస్తులు కుప్పల వద్దకు వచ్చి సరకు నాణ్యతను పరిశీలించి ధరలకు అనుకుణంగా యూజర్ ఐడీని నోట్ చేసుకుని ధరలను సీక్రెట్‌గా ఆన్లైన్లో కోట్ చేస్తుంటారు. దళారులు, వ్యాపారస్తులు సిండికేట్ అవ్వడానికి అవకాశం లేకుండా ఏర్పాటు చేశారు. అయితే… నిజామాబాద్‌లో కొద్ది మంది మాత్రమే ఆమ్చూర్ వ్యాపారులు ఉండటం వల్ల సిండికేట్‌గా మారి తక్కువ ధరలను రైతులకు కేటాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సరైన నిఘా పెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, రంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట ప్రాంతాల నుంచి ఆమ్‌చూర్‌ను నిజామాబాద్ మార్కెట్‌కు తరలిస్తుంటారు. మంచి నాణ్యత గల ఆమ్‌చూర్‌కు రూ.25వేల నుంచి రూ.35వేలు ధర అందివ్వాల్సి ఉంది. నాణ్యతలేమి, రంగు మారిందనే సాగుతో ఆమ్‌చూర్‌ను క్వింటా రూ.9వేలకు పతనం అవుతోంది. నాణ్యత ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో వ్యాపారులు తక్కువ ధరను ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత ఉన్న మామిడి వరుగుకు మంచి డిమాండ్ ఉంటుంది. అయినప్పటికీ రూ.25వేలు క్వింటా ధర దాటకపోవడం విడ్డూరంగా మారింది. తమ 3 నెలల కష్టాన్ని వ్యాపారులు నిమిషాల్లో వెల కట్టి నష్టపరుస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
ఆమ్చూర్ రైతుల కష్టానికి విలువే లేదు
సీజన్ మొత్తం కష్టపడి మామిడి కాయను కాపాడుకుని కూలీలను ఖర్చును భరించి 3 టన్నులు సేకరించాను. నెల రోజుల పాటు మామిడి కాయలను ప్రాసెసింగ్ చేసి ఎండకు ఎండబెడితే ఆమ్చూర్ రూపంలో 2 క్వింటాళ్లు చేతికి వచ్చింది. మా కష్టానికి ఫలితం దక్కాలంటే క్వింటాకు రూ.35వేలు రావాలి. కానీ అంత ధర లేదని చెబుతున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. క్వింటాకు రూ.18వేలు మాత్రమే ఇస్తుండడం వల్ల నష్టమే మిగులుతోంది.
– తుమ్మల పెంటయ్య, ముత్యంపేట, తోగుట మండలం, సిద్ధిపేట జిల్లా
నష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తోంది..
నెలల కష్టం వృథా అవుతోంది. ఆమ్చూర్ సాగుతో లాభమే ఉండటం లేదు. సరైన ధర రాకపోవడంతో నష్టం వస్తోంది. చెట్లను గుత్తకు పట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుని మామిడి కాయలను ఆమ్చూర్గా మార్చడం పెద్ద కష్టమైన పని. ఆమ్‌చూర్‌ను అమ్ముకునేందుకు నిజామాబాద్‌కు తప్పా వేరే చోటికి వెళ్లే పరిస్థితి లేదు. ఇక్కడేమో రూ.20వేలు లోపే ధర ఇస్తున్నారు. మేము ఎట్లా బతికేది. నష్టాల్లోనే కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
– సుఖమ్జీ, ముత్యంపేట, తోగుట మండలం, సిద్ధిపేట జిల్లా