ఖలీల్‌వాడి/కామారెడ్డి, జూలై 28: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లాల్లో ముసురేసింది. తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. వారం రోజులుగా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా మారిం ది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అత్యధికంగా నవీపేట్ 15.0, డిచ్పల్లి 14.4. భీమ్‌గల్ 13.1, మోస్రా 13.2, సిరికొండ 12.1, సాలూరా 12.8, నందిపేట్ 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఆలూర్ 6.7, డొంకేశ్వర్ 7.0, నిజామాబాద్ నార్త్ 7.6, కమ్మర్‌పల్లిలో 7.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 24 గంటలపాటు జిల్లాలో సగటు 11.2 వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా భిక్కనూర్‌లో 25.3, రాజం పేటలో 23.8,కామారెడ్డిలో 21, గాంధారి లో 18.8, తాడ్వాయిలో 18,మద్నూర్‌లో 15.8,అత్యల్పంగా నిజాంసాగర్‌లో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మోర్తాడ్, జూలై 28: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి ఆదివారం 20,370 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5టీఎంసీలు) కాగా, ఆదివారం ప్రాజెక్ట్‌లో 1074.9అడుగులు (32.657 టీఎంసీల) నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 624 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. సరస్వతీ కాలువకు 10క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 383 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నట్లు అధికారులు తెలిపారు.