కోటగిరి/వర్ని/నస్రుల్లాబాద్, జూన్ 26 : నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.వానకాలం పంటలకోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఆయన కోటగిరి, వర్ని, నస్రుల్లాబాద్ మండలాల్లో నిజాంసాగర్ ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలను సోమవారం పరిశీలించారు. సాగర్ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పీకర్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూన్లో నిజాంసాగర్ నీటిని విడుదల చేశామన్నారు. వడగండ్ల వాన, అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్నారని రైతులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ముందస్తు పంటసాగు ప్రణాళిక తయారు చేశారన్నారు.
ఈవిధంగా రైతులకు సంబంధిత శాఖ అధికారులు ముందస్తు పంట సాగుపై అవగాహన కల్పించారన్నారు. దీంతో రైతులు వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారని వారికి కావాల్సిన సాగర్ నీటిని కూడా అందిస్తున్నామన్నారు.గత ఏడాది యాసంగి సమయంలో నీరు పొదుపుగా వాడుకొని ఈ ఏడాది వానాకాలం సాగుకోసం 5టీఎంసీల నిలువ ఉంచామని పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్తో సమావేశమైనప్పుడు ప్రస్తుతం 5టీఎంసీల నీటికి తోడుగా మరో 5టీఎంసీల నీటిని కొండపోచమ్మసాగర్ లేద సింగూర్ నుంచి ఇప్పిస్తామని తెలిపి వెంటనే నిజాంసాగర్ నీటిని విడుదలకు అంగీకరించారని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో నీటిని వదలడానికి నెలల సమయం పట్టేదని, ప్రస్తుతం ఒక్క రోజులోనే నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సహకారం గతంలో, ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని అన్నారు. రైతుల మీద ఉన్న అభిమానంతో రైతుబంధు కూడా ఈ ఏడాది ముందుగానే ఇస్తున్నారని తెలిపారు. 2014లో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరి ఉత్పత్తి 36లక్షల టన్నులు ఉండేదని.. నేడు 3 కోట్ల టన్నులకు పెరింగిందని తెలిపారు. ఇందులో 70 లక్షల టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసే కెపాసిటీ మాత్రమే ప్రైవేటు మిల్లులకు ఉందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల టన్నులు మాత్రమే వినియోగిస్తారని మిగితాది ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుదన్నారు.
భవిష్యత్తులో రైతులకు ఇబ్బంది కలగకుండా వరి పండించే ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం మిల్లులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని స్పీకర్ తెలిపారు. రూ.250 కోట్లతో బాన్సువాడ నియోజక వర్గంలో సమారు 150 ఎకరాల విస్తీర్ణంలో గంటకు 60 టన్నుల కెపాసిటీ కలిగిన భారీ రైస్ మిల్లును ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు తమకు బియ్యం పంపాలని మన రాష్ర్టాన్ని కోరుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సామర్థ్యం మన రాష్ర్టానికి వచ్చిందని ఇది చాలా గొప్ప విషయమన్నారు.