ఆర్మూర్, జూలై 15: బీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆర్మూర్ నియోజకవర్గ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు, చేపూర్ గ్రామానికి చెందిన గొల్ల కుర్మ సంఘం, నాయక్‌పోడ్, మేదరి, పద్మశాలీ, గూండ్ల సంఘ సభ్యులు, మైనార్టీలు, పట్టణానికి చెందిన నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, పట్టణంలోని గ్లోరియస్ చర్చి అసోసియేషన్ సభ్యులతోపాటు ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో శనివా రం బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులా బీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజానరేందర్, సీనియర్ నాయకులు పండిత్ పవన్, ఖాందేశ్ శ్రీనివాస్, జీజీ రాం, మీరా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.