కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ ప్రాంతం బహుభాషా సంగమం. మహారాష్ట్ర, కర్ణాటకతో సరిహద్దులు పంచుకునే ఈ ప్రాంతంలో స్థానికుల అవసరం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియంతోపాటు మరాఠీ, ఉర్దూ మీడియం కొనసాగుతున్నాయి. ఈ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్షలా ఉండేది. పేదలు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలంటే ఫీజులకు భయపడి ఆ దిశగా ఆలోచించని పరిస్థితి. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ మీడియం బోధన త్వరలో ప్రారంభం కానుండడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
అందనిద్రాక్షలా ఇంగ్లిష్ మీడియం..
మద్నూర్ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్షలా ఉండేది. పేదలు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలంటే ఫీజులకు భయపడి ఆ దిశగా ఆలోచించని పరిస్థితి. ఆర్థికంగా బలవంతులైన వారికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం అనే భావన బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించనుండడంతో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాటలు పడనున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ తప్పనిసరి
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుచేస్తే విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. ‘మన ఊరు.. మనబడి’ విప్లవాత్మక నిర్ణయం. ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు. మా ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది.
-గంగారాం,రిటైర్డ్ ఉపాధ్యాయుడు
భవిష్యత్‌కు పునాది
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన విద్యార్థుల భవిష్యత్‌కు పునాది. పోటీ ప్రపంచంలో నిలబడి గెలవాలంటే ఆంగ్లం తప్పక రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఉన్నత విద్యాభ్యాసం, విదేశాల్లో చదువు, ఉద్యోగం ఎక్కడికి వెళ్లినా ఇంగ్లిష్ తప్పనిసరి అయ్యింది.
-రామారావు,రిటైర్డ్ ఉపాధ్యాయుడు
సంపాదించింది అంతా ఫీజులకే..
నా ఇద్దరు పిల్లలు బోధన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. పిల్లలు బాగా చదివి మంచి స్థాయిలో స్థిరపడాలనేది నా కోరిక. నాయీబ్రాహ్మణుడినైన నేను కులవృత్తి చేసుకుంటూ వారి చదివిస్తున్నా. నా సంపాదన వారి ఫీజులు, పుస్తకాలు, దుస్తులకే సరిపోతుంది. ‘మన ఊరు.. మనబడి’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ మీడియంప్రారంభించగానే నా పిల్లలను తీసుకువచ్చి ప్రభుత్వ బడిలో చేర్పిస్తా.
-మనోజ్, మద్నూర్