ఎల్లారెడ్డి రూరల్ : అమాయకమైన వృద్ధురాలికి మాయమాటలు చెప్పి కళ్ళలో కారం కొట్టి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, గుండ్లు దొంగిలించిన కిలాడీ లేడిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదు చేసిన 48 గంటలలోపే కేసును ఛేదించి నిందితురాలి నుండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను బుధవారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ వెల్లడించారు.
ఆయన తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన కాశవ్వ అనే వృద్ధురాలు 9వ తేదీ నాడు ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన వారాంతపు సంతకు వచ్చింది. సంతలో కూరగాయలు కొనుక్కొని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి ఆటోలో వెళ్లేందుకు బస్టాండుకు వచ్చింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఏశవ్వ అనే కిలాడీ లేడి వృద్ధురాలిని గమనించి ఆమె వెనకాలనే బస్టాండ్‌కు చేరుకుంది.
తర్వాత వృద్ధురాలు కాశవ్వతో మాటలు కలిపింది. దేవునిపల్లి గ్రామానికి వెళ్లాలంటే అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆటోలు ఉంటాయని, తాను కూడా అటే వెళ్తున్నానని నమ్మబలికింది. నమ్మిన వృద్ధురాలు ఆమెతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకుంది. అక్కడే ఉన్న సీఎస్ఐ చర్చి వెనకాల నుంచి వెళ్తే చాలా దగ్గరవుతుందని, ఆటో కూడా అవసరం లేదని, ఏశవ్వ వృద్ధురాలికి నచ్చచెప్పింది. ఆమె మాటలను నమ్మిన వృద్ధురాలు ఏశవ్వతోపాటు నడుస్తూ చర్చి వెనకాలకు చేరుకున్నారు.
అప్పటికే తన వెంట తెచ్చుకున్న కారంపొడిని ఏశవ్వ వృద్ధురాలి కళ్ళలో చల్లింది. వృద్ధురాలు కండ్లమంటల నుంచి తేరుకునేలోపే ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు, తులంనర బంగారు గుండ్లను తెంపుకొని పారిపోయింది. వృద్ధురాలు అరుపులు విని స్థానికులు గమనించి ఆమెను ఇంటికి చేర్చారు. కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి 48 గంటలలో నిందితురాలిని స్థానిక కూరగాయల మార్కెట్లో అదుపులోకి తీసుకున్నారు.
ఏశవ్వను విచారించగా బంగారు పుస్తెలతాడు సంగారెడ్డి జిల్లా శంకరంపేటలో కుదువ పెట్టానని, ముందస్తుగా పదివేల రూపాయలు తీసుకున్నానని చెప్పినట్లు సీఐ తెలిపారు. నిందితురాలు ఏశవ్వను విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టి, ఆమె దొంగిలించిన బంగారు పుస్తెలతాడును, రూ.10 వేలను చూపించారు. నిందితురాలు ఏశవ్వను స్థానిక కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వ్యాపార సముదాయాలలో, గృహాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఐ రవీందర్ నాయక్ ప్రజలను కోరారు. విలేకరుల సమావేశంలో ఎస్సై బొజ్జ మహేష్, ఏఎస్ఐ గంగారెడ్డి, సిబ్బంది అనిల్ గౌడ్, అర్చన తదితరులు ఉన్నారు.