రామారెడ్డి, జూలై 15: గోదాంలలో నిల్వ ఉంచిన బియ్యంలో తయారైన లక్కపురుగులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇండ్లలోకి వస్తున్న పురుగులు ఆహారంలో చేరి, ఒంటిపై పారి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. వీటి బెడద తొలగించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో బాధితులు రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామ శివారులోని గిడ్డంగుల ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్వాయి, పోసానిపేట్, మోషంపూర్, గిద్ద, తిర్మన్‌పల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు దాదాపు నాలుగు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు.
సమస్య పరిష్కరించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి రూరల్ సీఐ పల్లె శ్రీధర్‌గౌడ్, గిడ్డంగి అధికారులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. వారం రోజుల్లో లక్క పురుగుల సమస్యను తీర్చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోసానిపేట్, మోషంపూర్, ఉప్పల్వాయి సర్పంచులు సుద్దాల లింగం, జార లక్ష్మి, శ్రీవాణి, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.