నేటితరంలో స్మార్ట్‌ఫోన్ వాడకం తప్పనిసరి అయిపోయింది. ఏ పని కావాలన్నా.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. అదే సమయంలో.. ‘డిజిటల్ డిటాక్స్’ కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇలాంటి వారికోసం చైనాకు చెందిన ‘హైసెన్స్’ సంస్థ.. ‘హైసెన్స్-ఏ10’ పేరుతో సరికొత్త ‘ఈ-ఇంక్ ఫోన్’కు రూపకల్పన చేసింది. ఇది రెండు స్క్రీన్లతో వచ్చే వినూత్నమైన స్మార్ట్‌ఫోన్. ఇందులో మెయిన్ స్క్రీన్‌గా.. 6.13 అంగుళాల మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) ఈ-ఇంక్ డిస్ప్లే ఉంటుంది. వెనక వైపున డిటాచబుల్ కలర్ ఎల్సీడీ ప్యానెల్‌తో వస్తుంది. మార్కెట్లో సాధారణ ‘ఈ-ఇంక్ ఫోన్’లు అనేకం ఉన్నాయి. కానీ, అవసరమైనప్పుడు మ్యాప్స్, ఫొటోలు, వీడియోలు చూడటానికి అవి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. అయితే, ఈ కొత్త ఏ10.. ఆ పనులను రెండు స్క్రీన్లుగా విభజిస్తుంది. ముందు ఉండే ‘ఈ-ఇంక్’ ప్యానెల్.. పుస్తకాలు చదవడానికి, మెసేజ్‌లు, నోటిఫికేషన్ల కోసం ఉపయోగపడుతుంది.
మరో కలర్ ఎల్సీడీ స్క్రీన్.. అవసరమైనప్పుడు నావిగేషన్, ఫొటోలు, షాపింగ్, వీడియోల కోసం పనికొస్తుంది. అవసరం లేనప్పుడు కలర్ స్క్రీన్‌ను పక్కన పెట్టేయవచ్చు. దీనివల్ల ప్రయాణాల్లో చదువుకోవడానికి ఈ-ఇంక్ ఫోన్ స్లిమ్‌గా, తేలికగా మారిపోతుంది. అదే పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు కావాలనుకున్నప్పుడు.. వెనకవైపు ఎల్సీడీ స్క్రీన్‌ను అమర్చుకుంటే సరిపోతుంది. సాధారణ ఓఎల్ఈడీ, ఎల్సీడీ స్క్రీన్ల కంటే.. ఈ-ఇంక్ స్క్రీన్ కళ్లకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఆధునిక ఫోన్లలో ఉండే పీడబ్ల్యూఎం డిమ్మింగ్ వల్ల కంటి అలసట, మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే.. ఈ-ఇంక్ రిఫ్లెక్టివ్ మోడ్‌లో బ్యాక్‌లైట్‌ను ఉపయోగించదు. కాబట్టి ఎంతసేపు చూసినా కళ్లు ఏమాత్రం అలసిపోవు. కాబట్టి, ఫోన్లలో పుస్తకాలు, ఆర్టికల్స్, న్యూస్ లెటర్స్ చదివే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ సరికొత్త ఈ-ఇంక్ ఫోన్.. స్నాప్‌డ్రాగన్-6 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా, ఆండ్రాయిడ్-15తో వస్తున్న మొదటి ఈ-ఇంక్ ఫోన్ కూడా ఇదేనని ‘హైసెన్స్’ సంస్థ చెబుతున్నది.