నల్లగొండ రూరల్, జూలై 15 : నల్లగొండ మండలం చెన్నుగూడెంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఇందుకు సంబంధించి బాధితులు బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు 70 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిలోకి సర్పంచ్ మర్రి సతీష్, ఆయన అనుచరులు అక్రమంగా చొరబడి జేసీబీతో భూమిలోని బండరాళ్లను తొలగించడంతో పాటు భూమిని చదును చేశారన్నారు. అకడ ఉన్న నిర్మాణాలను సైతం ధ్వంసం చేశారని బాధితులు తెలిపారు.
అడ్డుకునే ప్రయత్నం చేసిన తమపై దాడులకు యత్నించారని, నిర్మాణాలు కూల్చివేస్తున్న సమయంలో డయల్ 100కు ఫోన్ చేశామన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఎలాంటి చర్యలు చేపట్టకుండానే వెనుదిరిగారని వారు వాపోయారు. అధికార పార్టీ అండదండలతోనే సర్పంచ్ అక్రమాలు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. సదరు భూమిపై సివిల్ కోర్టు లో కేసు నడుస్తున్నా..దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు.
న్యాయం కోసం పలుమార్లు పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ ఎస్సై అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని విజ్ఞ ప్తి చేశారు. ఈ విషయంపై సర్పంచ్ సతీష్‌ను వివరణ కోరగా ఎవరి భూమినీ తాను ఆక్రమించే ప్రయత్నం చేయలేదని, తమకు రావాల్సిన భూమిని మాత్రమే తాము చదును చేసుకుంటున్నామని పేర్కొన్నారు. బాధితులు మర్రి లింగయ్య, చంద్రయ్య, రాములు, యాదయ్య, ఐలయ్య, సైదులు, నరసింహ, శేఖర్, నరేష్ పాల్గొన్నారు.