స్క్రీన్టైమ్ నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న పదం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తెలియకుండానే జీవితంలో భాగమై, భారంగా తయారైంది. చిన్నారి ఏడుస్తున్నా, తిండికి మారాం చేసినా, చివరికి నిద్రపుచ్చడానికి కూడా ఫోన్ చేతుల్లో పెడుతూ వరంగా భావించిన తల్లిదండ్రులకు స్క్రీన్టైమ్ నేడు శాపంగా మారింది. ఒక ప్రముఖ చానెల్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఇన్స్టాగ్రాం సీఈవో ఆడమ్ మొస్సేరి చేసిన ఈ వ్యాఖ్యలు నేడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
అధిక స్క్రీన్టైమ్ వల్ల పిల్లల ప్రవర్తన, భావోద్వేగాల నియంత్రణ అదుపులో ఉండకుండా పోతున్నాయి. ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడిపే పిల్లల మానసిక ఆరోగ్యం, ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ నిపుణులు హెచ్చరించే ఈ మాటలే.. ఆడమ్ మొస్సేరి పేర్కొన్నారు. తన ఇంట్లో స్క్రీన్ టైం సులభంగా ఇవ్వనని తెలిపారు. వీడియోగేమ్స్ ఆడే తన పిల్లలకు స్క్రీన్టైమ్ లిమిట్ వారానికి మూడు అర గంటలుగా (గంటన్నర) నిర్దేశించినట్టు పేర్కొన్నారు. ఒకవేళ వారు ఆ మూడు అరగంటల స్క్రీన్టైమ్ వినియోగించుకోకుండా.. ఉపయోగకరమైన పని చేసి చూపిస్తే, ఆ సమయాన్ని వారాంతానికి సర్దుబాటు చేసేలా ఏర్పాటు చేశారు. వారాంతంలో ఒకేసారి గంటన్నరపాటు స్క్రీన్ చూసుకునే వెసులుబాటు కల్పించారట. ఈ కండిషన్ మంచి ప్రయోజనాన్నే ఇచ్చిందని చెబుతున్నారు మొస్సేరి. ఈ డిజిటల్ కాలంలో పేరెంటింగ్ కొంచెం కష్టంతో కూడుకున్నదైనా సరైన మార్పులు చేస్తే నష్టాలకంటే ప్రయోజనాలు పొందవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.