రామారెడ్డి, ఫిబ్రవరి 25: కూల్‌డ్రింక్ అనుకుని గడ్డిమందు తాగి దవాఖాన పాలైన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. పార్టీ నేతలను దవాఖానకు పంపించి వారి వైద్యానికి అయిన ఖర్చును చెల్లించారు. రామారెడ్డి మండలం స్కూల్తండాకు చెందిన గంగావత్ మంత్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు సంజన(10), బిందు(7) ఉన్నారు. మంత్ ఉన్న 25 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
పొలానికి కొట్టేందుకని ఇటీవల ఫర్టిలైజర్ షాప్ నుంచి కొనుక్కొచ్చిన మందును థమ్సప్ బాటిల్లో నింపి పెట్టాడు. శనివారం స్కూల్ నుంచి వచ్చిన ఇద్దరు కూతుళ్లు థమ్సప్ బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్‌గా భావించి తాగారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కామారెడ్డి దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందిన తర్వాత అక్కాచెల్లెలు కోలుకున్నారు.
అయితే, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులు ఫీజు కట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్యను దవాఖానకు వెళ్లాలని ఆదేశించారు. కేటీఆర్ ఆదేశాలతో మంగళవారం దవాఖానకు వెళ్లిన ఆగయ్య చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. పిల్లల వైద్యానికి అయిన ఖర్చును చెల్లించి దగ్గరుండి డిశ్చార్జి చేయించి ఇంటికి పంపించారు. కేటీఆర్‌కు, పార్టీ నేతలకు చిన్నారుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.