నిజామాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / ఖలీల్‌వాడి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ నగర పర్యటన విజయవంతమైంది. ఐదున్నర గంటల పాటు సాగిన కేటీఆర్ టూర్ సందడి వాతావరణంలో కొనసాగింది. నగర వ్యాప్తంగా చేపట్టిన రూ.వందల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీఆర్ఎస్ బహిరంగ సభ సైతం జన ప్రవాహంతో దద్దరిల్లిం ది. హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్న కేటీఆర్‌కు ఉభయ జిల్లా బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఐటీ హబ్‌ను ప్రా రంభించారు. ఉద్యోగాలు పొందిన యువతతో ముచ్చటించారు. అనంతరం పక్కనే నిర్మించిన న్యా క్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. దుబ్బా వైకుంఠధామం, మున్సిపల్ కొత్త ఆఫీస్, వర్ని రోడ్డులోని వైకుంఠధామం, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్, అర్సపల్లి వైకుంఠధామాలను వరుసగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, ఎంపీ సురేశ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఉభయ జిల్లాల జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ పాల్గొన్నారు. బహిరంగ సభలో తనదైన శైలిలో ప్రసంగించిన కేటీఆర్… కాంగ్రెస్, బీజేపీ తీరును ప్రజల ముందు బట్టబయలు చేశారు. వేదికపై నుంచి నిజామాబాద్ నగరపాలక సంస్థలోని 60 డివిజన్లలో అంతర్గత రోడ్ల కు ఒక్కో డివిజన్‌కు రూ.కోటి చొప్పున మొత్తం రూ.60కోట్లు మంజూ రు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు.

టార్గెట్ 55వేలు మెజార్టీ…
అభివృద్ధి కార్యక్రమాలు పైసలతోనే అయినప్పటికీ కమిట్మెంట్ ఉంటే మంచి పనులు జరుగుతాయన్నారు. పోయినసరి 27వేల మెజార్టీతో గెలిచిన బిగాలకు వచ్చే ఎన్నికల్లో 55వేల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి పనులు చేసిన వాళ్లను కడుపులో పెట్టుకోవాలన్నారు. నిజామాబాద్‌లో ఎన్నో పనులు అయ్యాయని వివరించారు. సగంలో ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని రూ.232 కోట్లు, మంచి నీళ్ల కోసం రూ.97కోట్లతో కొత్త పైప్‌లైన్, తెలంగాణ వచ్చినంక కేసీఆర్ నిర్ణయం ప్రకారం ప్రతి సంవత్సరం బడ్జెట్లోనే రూ.100కోట్లు పెట్టి వందల కోట్లు ఈ నగరానికి ఇచ్చామన్నారు.
అది మాత్రమే కాకుండా టీయూఎఫ్ఐడీసీ ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి మేరకు మరో రూ.100 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అనివార్య కారణాలతో కవిత ఈ సభకు రాలేకపోయినా కేసీఆర్ వద్దే కూర్చొని నిజామాబాద్ అభివృద్ధి కోసం నిధులు అడుగుతున్నారన్న సమాచారాన్ని ఇక్కడి ప్రజలకు చెప్పాలని తనతో చెప్పినట్లు కేటీఆర్ సభికులకు గుర్తు చేశారు. ఇవి కాకుండా రూ.20కోట్లతో మిషన్ భగీరథ, రూ.20కోట్లతో రైల్వే అండర్ పాస్, రూ.50కోట్లతో ఐటీ హబ్, రెండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ నేల కవులకు కాణాచి, రచయితలకు, సాహితీకారులకు కేంద్రమన్నారు. ఇలాంటి ప్రాంతంలో కళాభారతి ఉండాలని కేసీఆరే స్వయంగా ప్రతిపాదించి అదనంగా రూ.100 కోట్లు ఇచ్చి రూ.50కోట్లతో నిర్మా ణం చేపట్టామన్నారు. ఇదీ త్వరలోనే పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం నుంచి గతం లో చాలా మంది పెద్దోళ్లు పని చేసినప్పటికీ వాళ్లతో కాని పనులను 9ఏండ్లలో బిగాల చేశారన్నారు.
బిగాల సేవలు భేష్…
హైదరాబాద్‌లోని మహాప్రస్థానం వైకుంఠధామం కన్నా చాలా గొప్పగా దుబ్బ, అర్సపల్లి, వర్ని రోడ్లో రూ.15.50కోట్లతో నిర్మించిన వైకుంఠధామాలున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలాంటి నిర్మాణాలు రాష్ట్రంలో ఎక్కడా లేవన్నారు. ఇందుకు పూర్తి క్రెడిట్ గణేశ్ బిగాలకే దక్కుతుందన్నారు. ప్రజా సేవతో పాటుగా బిగాల తన సొంత డబ్బులతో మనసున్న మారాజులా కార్మిక దినోత్సవం రోజు సఫాయి కార్మికులకు దుస్తులు అందించడం వారితో కలిసి భోజనం చేయడం అద్భుతమన్నారు. కేసీఆర్ ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు ఆడపడుచులకు మీ ఎమ్మెల్యే దుస్తులు, బట్టలు అందిస్తున్నారని, మా ర్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలను గౌరవించి వాళ్లతో కూర్చొని భోజనం చేసి దీవనెలు తీసుకుని పట్టు చీర పెట్టే ఎమ్మెల్యే బిగాల అంటూ వివరించారు. గంజ్‌లో దీపావళి రోజున హమాలీలకు కొత్త బట్టలు పెట్టడం గొప్ప విషయమన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే వాళ్లు చిరకాలం గుర్తుకు పెట్టుకుంటారని కేటీఆర్ తెలిపారు. కరోనా సమయంలో 3 వేల మందికి 41 రోజులు ఉచితంగా ఇంటింటికీ ఆహారం అందించిన ఘనత బిగాలదేనని చెప్పారు.
నెర్రలు బారిన నేలకు పచ్చని కోకా…
ఎన్నికలు వస్తున్నాయంటే కొంత మంది గంగిరెద్దుల్లా వస్తారని వారంతా ఏదేదో చెబుతారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ హితవు పలికారు. హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో వచ్చేటప్పుడు చూస్తుంటే ఎటు చూసినా నిండుకుండల్లా చెరువులు. ఖాళీ లేకుండా నాట్లు వేసిన పొలాలు.. భూమాత ఆకుపచ్చ చీర కట్టినట్లుగా సుందర దృశ్యం కనిపించిందని కేటీఆర్ చెప్పారు. నెత్తురు కారిన నేల.. నెర్రలుబారిన నేల.. సామాజిక అసమానతలతో అతలాకుతలమైన తెలంగాణ.. సమైక్యపాలనలో ఆగమైన తెలంగాణ. ఇప్పుడు 9ఏండ్లలో ఎక్కడ్నుంచి ఎక్కడిదాకా వచ్చిందో అందరూ అర్థం చేసుకోవాల్నారు. 67లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు నుంచి ఇప్పుడేకంగా మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. పంజాబ్, హర్యానను తెలంగాణ వెనక్కి నెట్టిందని గుర్తు చేశారు.
కుసంస్కారి ఎంపీ అర్వింద్…
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేటీఆర్ తనదైన శైలిలో మండిపడ్డారు. కుసంస్కారి అంటూ మండిపడ్డారు. ఇక్కడో ఎంపీ ఉన్నడు. చదవుకున్నడో లేదో.. ఎట్లా చిల్లరగా మాట్లాడుతున్నడో మీరే చూస్తున్నారంటూ చెప్పారు. కేసీఆర్ వయసు, వాళ్ల నాన్న వయసంతా. మాకు బూతులు తిట్టుడు చాత కాదా. పెద్ద మనుషులను గౌరవించుకోవాలి. అదీ హిందూ సంప్రదాయం. నాగరికతకు చిహ్నం. 70 ఏండ్ల కేసీఆర్‌ను, 2 సార్లు సీఎంగా ఉన్న వ్యక్తిని పట్టుకుని తెలంగాణను చావు నోట్లో తలపెట్టి కొట్లాడిన వ్యక్తిని పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతు చేయడం ఖాయమని కేటీఆర్ తెలిపారు. వందల కోట్లు అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడి ఎంపీ చిత్తశుద్ధి ఉన్నోడైతే అభివృద్ధి కార్యక్రమాలకు రాడా? ముఖం లేదా? ఆయనతో నయా పైసా పని జరుగలేదని ఎద్దేవా చేశారు. మోదీ బోడీ ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200 చేసిన ఘనుడు మోదీ అంటూ విరుచుకు పడ్డారు. నాలుగు వందల రూపాయలకు సిలిండర్ ధర పెరిగితే 400 తిట్లు తిట్టిన మోదీనే ఇప్పుడు రూ.1200 చేసిండన్నారు. వచ్చే ఎన్నికల్లో గుండు కొట్టి బీజేపోడి డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు.
పింక్ సిటీ ఇందూర్…
మంత్రి కేటీఆర్ టూర్‌తో నిజామాబాద్ జిల్లా కేం ద్రం పింక్ సిటీగా మారింది. దాదాపు నగర పుర వీధుల్లో స్వాగత ఏర్పాట్లతో గులాబీమయమైంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇందూరు వేదిక జరిగిన కేటీఆర్ బహిరంగ సభ ఓ రకంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లుగా అనిపించింది. బీఆర్ఎస్ లీడర్లంతా ఏకతాటిపైకి వచ్చి సభా వేదికను పంచుకొని ఐక్యతను చాటుకున్నారు. కేటీఆర్ టూర్‌తో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపించింది. హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ వచ్చారు. సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో నేతలంతా కలిసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం లో మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, టీఎస్డబ్ల్యూఎఫ్సీ చైర్పర్సన్ ఆకుల లలిత, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు, పోచారం సురేందర్ రెడ్డి, దఫేదార్ రాజు, సుజీత్ సింగ్ ఠాకూర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.
ఐటీలో మేటి తెలంగాణ…
దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన మంత్రి కేటీఆర్. కేసీఆర్ జనరంజక పాలనలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబడింది. ఇందులో కేటీఆర్ భాగం ఎంతైనా ఉంది. దేశ, విదేశాల్లోని పారిశ్రామికవేత్తలను ఒప్పించి రూ.3లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చారు. 16లక్షల కొత్త ఉద్యోగాలు తీసుకు వచ్చారు. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 57వేల కోట్లు ఐటీ ఎగుమతులుంటే నేడు మూడున్నర లక్షల కోట్ల ఎగుమతులకు, 9లక్షల ఐటీ ఉద్యోగాలకు చేర్చారు. వారు కష్టపడిన ఫలితం మూలంగా తలసరి ఆదాయం రూ.3.17లక్షలకు ఎగబాకింది.బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలోని అన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి. నిజామాబాద్ నగర ప్రజలకు ఇలాంటి నాయకులు ఉండడం అదృష్టం.
– వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతోనే నగరాభివృద్ధి..
నిజామాబాద్ నగర అభివృద్ధి ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరిందంటే అందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ఆశీస్సులే కారణం. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి మీరు చూపిన దారి, పద్ధతిలో నడుస్తున్నందునే నిజామాబాద్ ఇంత అందంగా తయారైంది. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలే అనే కేసీఆర్ సూత్రాన్ని పాటిస్తున్నాం. మాట, మర్యాద మంచిగుంటే జీవితాంతం మిమ్మల్ని ఓడించేటోడు ఎవ్వరూ లేరని మాకు నిత్యం మా ముఖ్యమంత్రి చెబుతుంటారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తవ్వే సమయంలో సవాళ్లు ఎదురయ్యా యి. అవన్నీ దాటుకొని 2018లో భారీ మెజార్టీతో నగర ప్రజలు గెలిపించారు. నిత్యం ప్రజల ఆలోచనలు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయ డం ద్వారానే నిజామాబాద్ అత్యద్భుతంగా ఆవిష్కృతమైంది. బాజిరెడ్డి గోవర్ధన్, కవితక్క, మహేశ్ బిగాల సహకారంతో జాబ్ మేళా నిర్వహించి ఐటీ హబ్‌లో ఉద్యోగాలు భర్తీ చేశాం. కేటీఆర్ ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది.
– బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే