దశాబ్దాలుగా సాగునీటికి గోసపడ్డ రైతాంగం. తలాపున గోదావరి.. పంట చేలన్నీ ఎడారిగా మారిన దౌర్భాగ్యం. పల్లెపల్లెన కరువు రక్కసి విలయ కోరలు చాచిన దుస్థితి. పొట్ట చేత పట్టుకుని ఎడారి దేశాలకు వలస పోయిన పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన బతుకులు.. ఉన్న భూమిని, కన్న ఊరిని వదిలిపోయిన కుటుంబాలు.. అయితే, దశబ్దాల క‘న్నీటి గోస’కు తెరపడింది తెలంగాణ సిద్ధించాకే. బీడు వారిన పొలాల్లో గోదావరి పరవళ్లు తొక్కింది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాకే. సాగునీటి తిప్పలు తప్పిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర పుటల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
గోదావరిని ఎదురెక్కించి బంజరు భూముల్లో ‘జల’ కేతనం ఎగురవేశారు. ‘కాళేశ్వరం’తో తెలంగాణకు జలాభిషేకం చేసిన అభినవ భగీరథుడు చంద్రశేఖరుడు.. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ప్రాణప్రతిష్ట చేశారు. ఒక్క పంట పండడమే కష్టమైన దుస్థితి నుంచి ఏటా రెండు పంటలు సాగయ్యేలా చేశారు. బీడు వారిన మాగాణుల్లోకి గోదారమ్మను తీసుకొచ్చి సిరులు కురిపించి, ఉమ్మడి జిల్లా రైతుల నుంచి ‘జల’జయధ్వానాలు అందుకున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం వార్షికోత్సవం సందర్భంగా
‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
నిజామాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ఎత్తిపోతల పథకంగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధారగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు ‘కాళేశ్వరం’ ఊపిరి పోసింది. ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం, నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాల రాక ఒక అద్భుత ఘట్టంగా చరిత్రలో నిలిచి పోయింది.
గోదావరి, మంజీరా నదులపై నిర్మించిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వర్షాభావ పరిస్థితుల్లోనూ జల కళ సంతరించుకునేలా అప్పటి సీఎం కేసీఆర్ పటిష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. ఏటా జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాల కోసం ఎదురు చూసే ఆయకట్టు రైతులకు కాలంతో సంబంధం లేకుండా ప్రాజెక్టులో నీళ్లు నింపి భరోసానిచ్చారు. అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పట్టేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో ఆయకట్టుకు భరోసా కల్పించారు. కాళేశ్వరం నీళ్లను గ్రావిటీ ద్వారా నిజాంసాగర్‌కు తరలించి ఏటా రెండు పంటలు పండించేలా చేశారు.
రైతుల శ్రేయస్సు కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్షగట్టింది. అడుగడుగునా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నది. రైతుల కడుపు నింపే ప్రాజెక్టును నామరూపాల్లేకుండా చేసేందుకు కుయుక్తులు రచిస్తున్నప్పటికీ, ప్రకృతి రూపంలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించేందుకు అదే ప్రాజెక్టును రేవంత్ సర్కారు ఆయువుపట్టుగా వాడుకుంటున్నది. 2024 వానాకాలం, యాసంగిలో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది.
సింగూర్ జలాల విడుదలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అభ్యంతరాలు వ్యక్తం కాగా, తప్పనిసరి పరిస్థితుల్లో హల్దీవాగు ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్లను నిజాంసాగర్‌కు మళ్లించాల్సి వచ్చింది. కేసీఆర్‌పై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూనే చివరకు ఆయన హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టునే వాడుకునే దుస్థితికి రేవంత్ సర్కారు దిగజారింది. ఓ వైపు అదే నోటితో కాళేశ్వరం ప్రాజెక్టును దూషిస్తూ, మరోవైపు అదే కాళేశ్వరం నీళ్లను వాడుకుకోవడం రేవంత్ సర్కారుకే చెల్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2017 ఆగస్టు 10వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి భూమిపూజ చేశారు. రూ.1,067 కోట్ల వయ్యంతో ఎస్సారెస్పీ నీళ్లను దిగువకు పారించే వరద కాలువలపై మూడు చోట్ల పంప్‌హౌస్‌లు నిర్మించి.. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కిందకు నీళ్లు పారిన కాలువల్లోనే నీళ్లు మళ్లీ ఎదురెక్కేలా డిజైన్ చేసి నిర్మించడం ఇంజినీరింగ్ అద్భుతానికి నిదర్శనం. అనుకున్న విధంగానే రెండేళ్ల కాల వ్యవధిలోనే ఈ పనులు పూర్తయ్యాయి. వానాకాలంలో దిగువకు నీళ్లు వదిలే పరిస్థితి లేని ఎస్సారెస్పీలో పునరుజ్జీవ పథకంతో పునరుత్తేజం కలిగింది. కరీనంగర్ జిల్లా లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోసిన కాళేశ్వరం నీళ్లు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు 4కిలో మీటర్ల దూరంలో ఉన్న నూకపల్లి వరకు చేరుకుంటున్నాయి.
ఎస్సారెస్పీ వరకు ప్రతి 30 కిలో మీటర్ల దూరానికి ఒక పంప్‌హౌస్ నిర్మించడంతో మూడు చోట్ల నీళ్లు నిల్వ అవుతూ అక్కడి నుంచి వేగంగా ఎదురెక్కి ముందుకెళ్తుంటాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజరాజేశ్వర్రావు పేట వద్ద రెండో పంప్ హౌస్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వరద కాలువ నుంచి 0.100 కిలో మీటర్ పాయింట్ వద్ద మూడో పంప్ హౌస్‌ను నెలకొల్పారు. ఇక్కడి నుంచి నీళ్లను ఎత్తి పోచంపాడ్ ప్రాజెక్టులో పోస్తారు. ఒక్కో పంప్ హౌస్‌లో 11,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా ఎనిమిది మోటార్లు ఏర్పాటు చేశారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు. 2.30 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టే ఆధారం. కొన్నేళ్లుగా ఎగువ నుంచి వరద లేక నిజాంసాగర్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. వానాకాలం ప్రారంభ సమయానికి నీళ్లు లేక ఆయకట్టు రైతులను ఆదుకోవడం కష్టంగా మారింది. వానాకాలం ముగింపులో కురిసే భారీ వర్షాలకు గడిచిన నాలుగేళ్ల పాటు నిజాంసాగర్ గేట్లు వరుసగా ఎత్తుతున్నప్పటికీ, సమయానికి సాగు నీళ్లు అందించే అవకాశం లేదు. ఈ సమస్యకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో చెక్ పెట్టారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఎల్లంపల్లి, మిడ్ మానేరుకు తరలించి, అక్కడి నుంచి 25 కిలో మీటర్ల సొరంగ మార్గం ద్వారా సిద్దిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి రిజర్వాయర్ మీదుగా శ్రీరంగనాయకసాగర్లోకి ఎత్తిపోస్తున్నారు.
ఆ తర్వాత మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మసాగర్‌కు తరలించి ప్యాకేజీ 18లో భాగమైన హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు తరలిస్తున్నారు. ఎక్కడో ఉన్న గోదావరిని తీసుకొచ్చి నిజాంసాగర్ ఆయకట్టు రైతుల్లో కేసీఆర్ ఆనందం నింపారు. సింగూరు జలాలతో సంబంధం లేకుండానే నిజాంసాగర్‌కు ప్రాణ ప్రతిష్ట చేశారు. 2021 ఏప్రిల్ 22న కాళేశ్వరం జలాలు తొలిసారి నిజాంసాగర్‌కు తరలొచ్చాయి.