కమ్మర్పల్లి, డిసెంబర్ 28 : ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు రచించిన పుస్తకాలను హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లోని 38వ నంబర్ స్టాల్లో ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న మంత్రి నవలలు రచించిన 12 మంది విద్యార్థినులను హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. ఆప్యాయంగా మాట్లాడి వారి ప్రతిభను మెచ్చుకున్నారు.
కళాశాలలో అందుతున్న విద్య, వసతులపై ఆరా తీశారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థినుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఇంగ్లిష్ లెక్చరర్ సంధ్యదీప్తిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పేద పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా నాణ్యమైన విద్యను అందించాలన్నదే కేసీఆర్ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆడ పిల్లల చదువులకు ఇబ్బంది కలుగకూడదనే ఆలోచనతో ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియళ్లను కొత్తగా నెలకొల్పారని వివరించారు. అనంతరం తన ఇంట్లోనే విద్యార్థినులకు భోజనం ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి ఉన్నారు.