భీమ్‌గల్, నవంబర్ 17: లింబాద్రి గుట్ట కార్తీకమాస బ్రహ్మోత్సవాలు ఆదివారంతో సంపూర్ణమయ్యాయి. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగిసినట్లు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి ఏడు గంటలకు గ్రామాలయానికి బోనాలు, హారతులతో బయల్దేరారు. దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వామివారికి నీరాజనం పలికారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుచోటుచేసుకోకుండా ఎస్సై నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా గుట్టకింద వెలిసిన దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి.
శ్రీలక్ష్మీనృసింహుని ఉత్సవ విగ్రహాలు శ్రీవారి కొండ నుంచి భీమ్‌గల్‌కు సాయంత్రం చేరుకున్నాయి. అశ్వవాహనంపై స్వామిని అలంకరించి బాజాభజంత్రీలతో శ్రీలక్ష్మీ నృసింహుడిని గ్రామాలయానికి ఎదుర్కొన్నారు. ఆదివారం ఉదయం కమల పుష్కరిణి మండపంలో స్వామివారికి డోలాసేవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.