అంధత్వ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. మిగతా చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా శిబిరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి రోజు కంటి వెలుగు శిబిరాల వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. కంటి వైద్య నిపుణులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కండ్ల అద్దాలను ఉచితంగా అందజేశారు. శస్త్రచికిత్స కోసం పలువురిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రిఫర్ చేశారు. శిబిరానికి వచ్చే వారి కోసం టెంట్లు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు.
కేసీఆర్ దూరపు చూపు మంచిది..
పేదలకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ముందుచూపుతో కంటి పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు ఉచితంగా అందించడం అభినందనీయం. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దిన మహానుభావుడు కేసీఆర్.
-సుజాత, కామారెడ్డి
మంచి కార్యక్రమం..
కంటి వెలుగు చాలా మంచి కార్యక్రమం. చాలా బాగున్నది. డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేసి కండ్లద్దాలను ఉచితంగా ఇచ్చారు. ఇంటి వద్దనే పరీక్షలు నిర్వహిస్తుండడంతో చాలా మంది వస్తున్నారు. ప్రజల
సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్
కంటివెలుగు చేపట్టారు.
– లత, హౌసింగ్ బోర్డుకాలనీ, నిజామాబాద్
కేసీఆర్ సల్లంగ ఉండాలె..
డాక్టర్లు అన్నిరకాల పరీక్షలు చేశారు. కొత్త కండ్లద్దాలను ఉచితంగానే ఇచ్చారు. ప్రభుత్వ దవాఖానలో ఆపరేషన్ చేస్తామని చెప్పారు. కంటిచూపు ఇబ్బందులను తీరుస్తున్న కేసీఆర్ సార్ సల్లంగ ఉండాలె.
– ఈ.లక్ష్మి, ఆర్యనగర్, నిజామాబాద్
పెద్ద కొడుకోలె సాయం చేశాడు..
కేసీఆర్ పెద్ద కొడుకులాగా సాయం చేశాడు. ఈ వయస్సులో కండ్లు సరిగ్గా కనబడని మాకు పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. బయట పరీక్షలు చేసుకొని కండ్లద్దాలు కొనుక్కోవాలంటే చాలా పైసలు ఖర్చు అయ్యేవి. కేసీఆర్ ఉచితంగా పరీక్షలు చేయించి, అద్దాలు ఇచ్చిండు.
-లక్ష్మి, కామారెడ్డి
కంటి పరీక్షలు చేశారు..
ఖలీల్‌వాడి, జనవరి 19: కంటి పరీక్షలు చేస్తున్నారని వచ్చిన. అన్ని రకాల పరీక్షలు చేశారు. మిషన్ పెట్టి కండ్లను పరీక్షించారు. దగ్గర, దూరపు చూపులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. కండ్లద్దాలు ఇచ్చారు. కండ్ల మందులను కూడా ఉచితంగానే ఇచ్చారు. మా కంటి చూపుకోసం ఇంతజేస్తున్న కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– లక్ష్మి, వినాయక్‌నగర్, నిజామాబాద్