సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఇండ్లు లేని పేదలకు, ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసముంటున్న ప్రతి ఒకరికీ ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించి అండగా నిలుస్తాం.. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒకరికీ న్యాయం చేస్తాం..అని అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… ఇప్పుడు బాధితులకు ధోకా చేస్తోంది. మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు చేసిన హామీలు నీటిమూటలుగానే మారుస్తున్నారు. మేడ్చల్ మలాజి గిరి జిల్లాలోని కొన్ని కాలనీల బాధితుల కన్నీటి గాథలకు పరిష్కారం చూపుతామంటూ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. విధానపరమైన నిర్ణయాల పేరిట పెడుతున్న మెలికలు.. జీవో నం. 118 బాధితులకు శాపంగా మారుతున్నాయి.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాల్సిన సరారు నిబంధనలు షరతులు వర్తిస్తాయంటూ కొన్ని కాలనీల వాసులకు కన్నీళ్లను మిగిల్చేలా చేస్తుంది. ఇచ్చిన హామీలను మరిచి, ఆచరణలో మరో విధంగా వ్యవహారించడంపై వందలాది పేద కుటుంబాల ఆశలు గాలిలో దీపంలా మారాయి. అనధికారికంగా నిర్మించుకున్న కాలనీలు, బస్తీల్లోని నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నం. 118 తీసుకువచ్చింది. దీని ద్వారా పదుల సంఖ్యలో కాలనీల్లోని ఆస్తులను రెగ్యులరైజ్ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారం మారడంతో ఆ జీవో అమలులోకి రాలేదు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కారు..
జీవోను అమలు చేయకుండా రెండేండ్లుగా కాలయాపన చేస్తున్నది. నిబంధనల పేరిట పెడుతున్న మెలికలు, ఇచ్చిన ఆదేశాలకు మధ్యన పొంతన లేకపోవడంతో క్రమబద్ధీకరణకు నోచుకోకుండా పోయేలా ఉన్నాయి. మేడ్చల్ మలాజిగిరి జిల్లా పరిధిలోని సాయిప్రియ నగర్, సత్యనారాయణపురం కాలనీల వాసుల ఆవేదన ఉదాహరణగా నిలుస్తోంది. ఇకడ నివసించే నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు 1995 నుంచి 2002 మధ్య కాలంలో తమ కష్టార్జితాన్ని రూపాయి రూపాయి కూడబెట్టి, వాయిదాల పద్ధతిలో ప్లాట్లు కొనుగోలు చేసుకున్నారు. అయితే అవి ప్రభుత్వ భూములంటూ గత ప్రభుత్వం జీవో నం. 118ని తెచ్చింది. ఆ జీవో ప్రకారం సాయిప్రియ నగర్, సత్యనారాయణపురం వాసులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. సుమారు 300కు పైగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్లో కొన్ని రెగ్యులరైజ్ కాగా, మిగతా వందలాది దరఖాస్తులు ఇప్పటికీ మోక్షానికి నోచుకోలేదు.
అమలు కానీ మంత్రి హామీ ..
ఇటీవల ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఈ కాలనీల బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జీవో 118 కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒకరి ప్లాట్ ను క్రమబద్ధీకరిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆనాడు మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో బాధితుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల దగ్గరికి వెళ్లేసరికి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. “సాయిప్రియనగర్, సత్యనారాయణపురం కాలనీలకు సంబంధించిన అంశం పూర్తిగా సరారు పరిధిలో ఉంది. పై నుంచి ప్రత్యేక ఆదేశాలు వస్తే తప్ప క్రమబద్ధీకరణ సాధ్యం కాదు’ అంటూ అధికారులు చేతులెత్తేశారు. తాజా జాబితాలో ఈ కాలనీల పేర్లు లేవంటూ తెగేసి చెప్పడంతో బాధితులు బిక్కమోహాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
మోసపోయామంటూ ఆగ్రహావేశాలు..
ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట అన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మంత్రి మాటలకు విలువ లేదా? అని ప్రశ్నిస్తున్నారు. క్రమబద్ధీకరణకు ఒక దరఖాస్తు చాలనీ, దాన్ని పూర్తిగా పరిషరిస్తామని స్వయంగా మంత్రి పొంగులేటి ప్రకటించినా.. అధికారులు మాత్రం కొత్త జీవో వస్తేనే చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని బాధితులు నిలదీస్తున్నారు. వందలాది మంది దరఖాస్తు చేసుకుంటే, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వాటిని పకన పెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తూ, దశాబ్దాలుగా ఇకడే నివాసముంటున్న సాయిప్రియ నగర్, సత్యనారాయణపురం వాసులపై ప్రభుత్వ వివక్ష చూపడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మేడ్చల్ మలాజిగిరి కలెక్టర్ స్పందించి, జీవో 118 కింద దరఖాస్తు చేసుకున్న సాయిప్రియ నగర్, సత్యనారాయణపురం కాలనీల 300కు పైగా పెండింగ్ దరఖాస్తులను పునరుద్ధరించాలని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక పంపి, దశాబ్దాల కల అయిన ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసి మంత్రి ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. రాజకీయ కక్షలు, అధికారుల కొర్రీల కారణంగా దశాబ్దాల కష్టాన్ని కనుమరుగు చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదని, తక్షణమే జీవో 118 దరఖాస్తులను ఆమోదించి తమకు పట్టాలు ఇవ్వాలంటున్నారు.