హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తురంగాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, లాభాల్లో ఉన్న ట్రాన్స్‌కో ఆస్తులను సీఎం రేవంత్‌రెడ్డి తన దోస్తులకు దోచిపెట్టేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముకు ఆశపడి కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దిన కరెంట్ వ్యవస్థను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. దేశంలో విద్యుత్తు పంపిణీని ప్రైవేట్‌పరం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదని స్పష్టంచేశారు.
ఒడిశా, ఢిల్లీ, ముంబైలో ప్రైవేట్‌కు కట్టబెట్టడం ద్వారా బిల్లులు పెరుగడం, సరిపడా కరెంట్ ఇవ్వక పోవడం తప్ప ఒరిగిందేమీ లేదని గుర్తుచేశారు. కానీ ఇదేమీ పట్టని సర్కార్ విద్యుత్తురంగంపై కత్తిగట్టిందని ఆయన ధ్వజమెత్తారు. ఇంతటి కీలకమైన వ్యవస్థను ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెడితే ప్రజల ఊపిరి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, పార్టీ నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మన్నె గోవర్ధన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, కేసీఆర్ పథకాలను అటకెక్కించిందని దుయ్యబట్టారు. సాగు, తాగునీరు, కరెంట్ ఇవ్వడంలో విఫలమైందని మండిపడ్డారు.
వెలుగులు నింపింది కేసీఆరే..
ఉమ్మడి పాలనలో చీకట్లు కమ్ముకున్న తెలంగాణలో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని జగదీశ్‌రెడ్డి కొనియాడారు. నాడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్తు వ్యవస్థపై సమీక్షించి, విద్యుత్తు వ్యవస్థలో అద్భుత ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, శంకర్‌నారాయణ్ నియామకాలు ఈ కోవలోనే జరిగాయని గుర్తుచేశారు. సబ్స్టేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచి, 28వేల విద్యుత్తు లైన్లు వేశామని, వెరసి ట్రాన్స్‌కోకు లక్షల కోట్ల ఆస్తులు సృష్టించామని వివరించారు. ‘అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లోనే గృహ వినియోగదారులతో పాటు అన్ని రంగాలకు 24గంటల కరెంట్ సరఫరా చేశారు.. ఆ తర్వాత మూడేండ్లు తిరుగకముందే సాగుకు సైతం 24గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చారు.. ఒక్క ట్రాన్స్కోపైనే రూ.36 వేల కోట్లు వెచ్చించి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను పటిష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎక్కడ కరెంట్ పోయినా ఒకచోట నుంచి మరోచోటుకు కరెంట్ సరఫరా చేసే వ్యవస్థను తీర్చిదిద్దారు’ అని గుర్తుచేశారు. ఆనాడు కరెంట్ పోతే వార్త అనే పరిస్థితికి రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందని పునరుద్ఘాటించారు.

Jagadishreddy
ట్రాన్స్‌కో ఆస్తులను కారుచౌకగా అమ్మే యత్నం
నాడు కేసీఆర్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా కరెంట్‌ను ప్రైవేట్‌పరం చేయలేదని జగదీశ్‌రెడ్డి నొక్కి చెప్పారు. పవర్ జనరేషన్ కాంట్రాక్టులను భెల్, జెన్కోకు అప్పగించారని చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డి ట్రాన్స్‌కోకు చెందిన లక్షల కోట్ల ఆస్తులను కారుచౌకగా అమ్మేసేందుకు కుట్రలు చేస్తు న్నారని ఆరోపించారు. సర్కార్ నిర్ణయాలతో విద్యుత్తు ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదేందని ప్రశ్నించిన అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఏసీబీతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ‘విద్యుత్తును ప్రైవేటీకరిస్తే ఉచిత విద్యుత్తు నిలిచిపోతుంది.. రైతులపై పెనుభారం పడుతుంది.. దళితులు, ఇతర అణగారిన వర్గాలకు కరెంట్ సబ్సిడీలు ఆగిపోతాయి.. చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి’ అని స్పష్టంచేశారు. కరెంట్ వ్యవస్థ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకమని స్పష్టంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌పై కాంగ్రెస్ నేతల పిచ్చి ప్రేలాపనలు
యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై కాంగ్రెస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. యాదాద్రిలో జీ9 నుంచి జీ15 వరకు ఏ గ్రేడ్ బొగ్గునైనా వినియోగించవచ్చని స్పష్టంచేశారు. సింగరేణికి దూరంగా, బొగ్గు నిల్వలు లేనిచోట పవర్‌ప్లాంట్ ఎలా పెట్టారని ప్రశ్నించడం శోచనీయమని మండిపడ్డారు. ‘మరి ఎక్కడో ఉన్న నైనీ బ్లాక్.. బొగ్గు తెలంగాణకు సరఫరా చేయడం లేదా? గతంలో విజయవాడ, రాయలసీమలో థర్మల్ స్టేషన్లు పెట్టలేదా? వారికో విధానం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరొకటా? అని సూటిగా ప్రశ్నలవర్షం కురిపించారు. ఫ్లైయాష్పై ఆధారపడే సిమెంట్ పరిశ్రమలు ఉన్నందునే దామరచర్లలో పవర్‌ప్లాంట్‌లో పెట్టామని స్పష్టంచేశారు. నల్ల గొండలో పవర్‌ప్లాంట్ వద్దనే వాళ్లను చెప్పుతో కొట్టాలని తీవ్రంగా హెచ్చరించారు. దామెరచర్లపై సాకులు చెబుతున్న ప్రభుత్వం మరి సింగరేణి బొగ్గు ఉన్న కొత్తగూడెం, భద్రాద్రి థర్మల్ పవర్స్టేషన్లలో ఉత్పత్తిని ఎందుకు నిలిపివేశారని? నిలదీశారు.
ఉత్పత్తి చేయడం చేతగాకే తప్పుడు లెక్కలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. పవర్ప్లాంట్లకు కాంగ్రెస్ దయ్యంపట్టిందని దెప్పిపొడిచారు. తెలంగాణ రాకముందు 6,500 మెగావాట్లు ఉన్న విద్యుత్తు ఉత్పత్తి కెపాసిటీని 21వేల మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. ఇప్పటికంటే మరో వంద మిలియన్ల యూనిట్ల డిమాండ్‌ను తట్టుకొనేలా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. దసరాలోగా పూర్తిస్థాయి కరెంట్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడం సిగ్గుచేటని, ఇప్పటిదాకా ఎందుకు రేపటి నుంచే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాజస్థాన్‌లో3,100 మెగావాట్లతో పవర్‌ప్లాంట్ ఎందుకు పెట్టాలనుకున్నారు? తెలంగాణకు హిమాచల్‌లో హైడల్ ప్రాజెక్టు ఎందుకు? అది కొట్టుకుపోయిందని, దాని కోసం రూ.52 కోట్లు కట్టబెట్టినట్టు తెలిసింది.. దీనిపై కూపీ లాగుతున్నాం.. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడుతాం’ అని స్పష్టంచేశారు.
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నదని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. జీ13, జీ9 బొగ్గు ఉత్పత్తి కావడం లేదని, అందుకే పవర్ ప్లాంట్లు నడుపడం లేదని ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. నిరుడు జనవరి 26న సీఎం రివ్యూలో జీ9 బొగ్గు ఉత్పత్తి అవుతుందని అధికారులు చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సైతం ఆధారాలతో బయటపెట్టిందని స్పష్టంచేశారు. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తిపై తప్పుడు లెక్కలు చెప్పారని ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేసి భారీ స్కామ్‌కు తెరతీశారని విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి తన మిత్రుడు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, గురువు చంద్రబాబు ఆజ్ఞలు పాటిస్తూ పొరుగు రాష్ట్రాలకు నాణ్యమైన బొగ్గును పంపుతున్నారని ధ్వజమెత్తారు.