న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లను చూసి విదేశీ మదుపర్లు బెంబేలెత్తిపోతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదన్న అంచనాలు ఓవైపు
వినిపిస్తుంటే.. మరోవైపు మాత్రం ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రదర్శనను ఇస్తున్న సూచీల్లో నిఫ్టీ 50 కనిపిస్తుండటం గమనార్హం. అవును.. గ్లోబల్ బ్రోకరేజీ బెర్న్‌స్టెయిన్ తమ తాజా నివేదికలో
భారతీయ ఈక్విటీలకు విదేశీ మదుపర్లు దూరమవుతున్నట్టు స్పష్టం చేసింది. కొత్త టెక్నాలజీల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల నడుమ తమ వ్యాపారాలను బలోపేతం చేసుకోవడానికి బడా
కార్పొరేట్లు పడుతున్న కష్టాలు.. విదేశీ మదుపర్లను పెట్టుబడుల ఉపసంహరణలకు ఉసిగొల్పుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఆకట్టుకోని లార్జ్‌క్యాప్ షేర్లు
లార్జ్‌క్యాప్ షేర్ల వైభవాన్ని గతించిన చరిత్రగానే బెర్న్‌స్టెయిన్ పేర్కొన్నది. జనవరి నుంచి గమనిస్తే.. 10 శాతానికిపైగా నిఫ్టీ 50 నష్టపోయింది. దీంతో భారత్ నమోదు చేస్తున్న ఆకర్షణీయ ఆర్థిక వృద్ధి..
ఇక్కడి స్టాక్ మార్కెట్లను ప్రతిబింబించడం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే బ్లూచిప్ షేర్లతో పోల్చితే మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు పంచుతున్న రాబడులు బాగున్నాయన్న విశ్లేషణలైతే
ఉన్నాయి. నిఫ్టీ 50 కంపెనీల సగటు ఆదాయ వృద్ధి ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 11 శాతంగా ఉంటే.. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 31 శాతంగా ఉన్నదని భారతీయ బ్రోకింగ్ సంస్థ ఆంబిట్ క్యాపిటల్
గుర్తుచేస్తున్నది.

Investors
ఇదీ సంగతి..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి పెద్ద సంస్థల షేర్లు ప్రస్తుతం 52 వారాల కనిష్ఠ స్థాయి సమీపాన ట్రేడ్ అవుతున్నాయి. అలాగే కృత్రిమ మేధస్సు (ఏఐ)కున్న డిమాండ్ దృష్ట్యా
ఐటీ సంస్థల లాభాలూ ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. ఇక అంతర్గత ఆధిపత్య పోరుతో టాటా గ్రూప్ కంపెనీల పెట్టుబడులు ప్రభావితమవుతుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది.
అయితే తయారీ, ఫిన్‌టెక్, కన్జ్యూమర్ టెక్నాలజీ సహా ఆయా రంగాల్లోగల మధ్య, చిన్నతరహా సంస్థల షేర్లకు గిరాకీ ఉండటం విశేషం. దీంతో విదేశీ మదుపర్లు బడా సంస్థల్లో పెట్టుబడుల కంటే మధ్య,
చిన్నతరహా సంస్థల్లో పెట్టుబడులకే అమితాసక్తిని కనబరుస్తున్నారు.
ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను సుదీర్ఘ విరామం తర్వాత పెంచడం కూడా బాండ్ మార్కెట్ల వైపునకు విదేశీ మదుపర్లు చూడటానికి ప్రేరేపిస్తున్నది. ఇక వచ్చే నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేయనున్నది. అందులో వడ్డీరేట్లు పెరిగితే.. మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఖాయమే. అలాగే మిడిల్ ఈస్ట్ వార్ ముదిరినా నష్టాలు తప్పవనే చెప్పవచ్చు. అంతేగాక భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంచనాలూ ప్రభావితమవుతాయని అంటున్నారు. దీంతో ఈ నెల భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు మరిన్ని పెట్టుబడులను వెనుకకు తీసుకోవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి.
విదేశీ మదుపర్లు దూరం..
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ ఈక్విటీల నుంచి విదేశీ మదుపర్లు దాదాపు రూ.2.50 లక్షల కోట్ల (26 బిలియన్ డాలర్లు) పెట్టుబడుల్ని వెనుకకు తీసుకున్నారు. ఇది గరిష్ఠ స్థాయి కావడం
గమనార్హం. నిజానికి జూలై, ఆగస్టు నెలల్లో పెట్టుబడులు వచ్చినా.. సెప్టెంబర్‌లో మళ్లీ పోతున్నాయి. డిపాజిటరీ సంస్థ ఎన్ఎస్డీఎల్ వివరాల ప్రకారం.. ఈ నెలలో ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్ముకున్న స్టాక్స్
విలువ 1.7 బిలియన్ డాలర్లు (రూ.16,000 కోట్లపైనే)గా ఉండొచ్చని అంచనా. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలతో దేశీయంగా
విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు అంచనాలు వంటివి మదుపర్లను పెట్టుబడులకు దూరం చేస్తున్నాయి.