ఎల్లారెడ్డి, మే 24: భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన చెరువు తెగిపోయింది. దాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి మరమ్మతులు చేయిస్తామని ఇచ్చిన హామీ ఆ వరదలోనే కొట్టుకుపోయింది. పది నెలలు దాటినా తట్టెడు మట్టి ఎత్తిందీ లేదు. కట్ట బలోపతం చేసిందీ లేదు. పనులు పూర్తి కాక, చెరువులో నీళ్లు లేక కన్నాపూర్ గ్రామస్తుల కష్టాలు రెట్టింపయ్యాయి. నీటి కొరత వెంటాతుండడంతో రైతులు ఆగమవుతున్నారు. కొన్ని కుటుంబాలు ఇప్పటికే వలస వెళ్లగా, మరికొందరు సైతం వలస బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ‘మా మొరను ఆలకించే వారే లేరు. వేసిన పంట కొట్టుకుపోయింది. నల్లటి మట్టితో కూడిన పొల్లాల్లో రాళ్లు రప్పలు మేటలు వేశాయి. చెరువులో నీళ్లు లేక బోర్లు ఎత్తిపోయినయ్. మా బతుకులు ఆగమైనయ్. పొట్ట కూటి కోసం వలస పోకుండా ఈడ ఏం చేయమంటారని’ కన్నాపూర్ గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బీడుగా మారిన భూములు
సరిగ్గా పది నెలల క్రితం కుండపోత వర్షం కురిసింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన భారీ వరద కన్నాపూర్లోని చౌదరి చెరువును ముంచెత్తింది. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చౌదరి చెరువుతో కన్నాపూర్, కోమట్పల్లి, పోల్కంపేట, మెదక్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామాల పరిధిలోని సుమారు 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఈ చెరువు కట్ట వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అంతేకాదు, గ్రామాన్ని వరద చుట్టుముట్టడంతో నాలుగు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. సారవంతమైన భూములు బీడు భూములుగా మారాయి. రాళ్లు, ఇసుకతో నిండిపోయాయి. మరోవైపు, చెరువులో నీళ్లు లేక బోర్లు ఎత్తిపోయి తాగునీటికీ కటకట ఏర్పడింది.
వలస బాట..
పది నెలలుగా చెరువు కట్టకు మరమ్మతులు లేకపోవడంతో నాలుగు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది పంటలు కోల్పోయిన అన్నదాతలు.. వచ్చే సీజన్లోనూ పంటల సాగుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. గతేడాది పంటలు లేక కన్నాపూర్ గ్రామానికి చెందిన 20 కుటుంబాలు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే తమను ఆదుకోవాలని రైతులు పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్కు, కలెక్టర్కు విన్నవించారు. కానీ వారి గోడు ఎవరికీ పట్టలేదు. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రిని సైతం కలిసి మొర పెట్టుకున్నారు. 150 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన చెరువు కట్టకు మరమ్మతులు చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని నాలుగు గ్రామాల రైతులు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి హామీకీ దిక్కులేదు..
భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి సీఎం రేవంత్రెడ్డి.. లింగంపేట మండలంలోనూ పర్యటించారు. రైతులకు అండగా ఉంటామని, కొట్టుకుపోయిన చెరువులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి పది నెలలు గడిచి పోయింది. ఇప్పటికీ ఒక్క చిల్లి గవ్వ కూడా మంజూరు కాలేదు. తట్టెడు మట్టి తీసి కట్ట బలోపేతం చేసిన దాఖలా లేదు.
మరమ్మతులు ప్రారంభించకపోతే పోరాటమే..
కన్నాపూర్ చౌదరి చెరువు మరమ్మతులు ప్రారంభించకపోవ డం దారుణం. పది నెలలైనా పైసా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. చెరువును నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులు ఎలా బతకాలి? ఇప్పటికే రైతులు చాలా నష్టపోయారు. సారవంతమైన పొలాలు ఎటూగాకుండా పోయాయి. ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి, చెరువు కట్టను పునర్నిర్మించాలి. లేకపోతే రైతుల కోసం బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తాం.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
తాగడానికి నీరు కష్టంగా దొరుకుతుంది..
చెరువు కింద ఉన్న బోర్లు నీళ్లు పోస్తలేవు. చెరువులో నీరు ఉన్నప్పుడు అవి పుష్కలంగా పోసేటివి. ఇప్పుడు పంటలకు నీరు లేదు. తాగడానికి వేసిన బోర్లు కూడా ఎండిపోతున్నాయి. పోయినసారి పడ్డ వానలకు అంతా కొట్టుకు పోయింది. నా పొలంలోని బోరు కూడా కొట్టుకుపోయింది. ఎకరం, రెండు ఎకరాల పొలం ఉన్నవాళ్లమే ఎక్కువగా ఉన్నాం. చెరువు మంచిగైతేనే మేం ఇంత పంట వేసుకొని బతుకుతాము. లేదంటే యాడికైనా పోతేనే పొట్ట గడుస్తది. గవరన్నమెంటు కట్టకు పైసలిచ్చి జల్ది మంచిగ జేపిస్తే పుణ్యముంటది.
– కిష్టయ్య, రైతు, కన్నాపూర్
కుటుంబాల వలస..
నిరుడు భారీ వర్షాలకు చౌదరి చెరువు కట్ట కొట్టుకుపోయింది. నాలుగు గ్రామాల ప్రజలకు బతుకుదెరువు కరువయ్యింది. పంటలు పండక పోవడంతో మా గ్రామం నుంచి 20 కుటుంబాల దాకా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. వచ్చే వానాకాలం కూడా పంటలు సాగయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఇలాగైతే మరిన్ని కుటుంబాలు వలస పోతాయి. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరీ చేసి, పనులు ప్రారంభిస్తే రైతులకు నమ్మకం కలిగి ఇక్కడే ఉంటారు.
– గారబోయిన శ్రీనివాస్, రైతు, కన్నాపూర్, లింగంపేట.
ప్రతి పాదనలు పంపించాం..
లింగంపేట మండలంలోని కన్నాపూర్ చౌదరి చెరువు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాం. చెరువు కట్ట భారీగా తెగి పోవడంతో రూ.2.81 కోట్లు అవసరమని ప్రతిపాదించాం. అలాగే, మండలంలోని మల్లారం చెరువు మరమ్మతుల కోసం కూడా రూ.1.67 కోట్లు కావాలని నివేదించాం. నిధులు మంజూరు కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.
– వెంకటేశ్వర్లు, నీటిపారుదలశాఖ డీఈఈ, ఎల్లారెడ్డి