నిజామాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);దళితబంధు కార్యక్రమం అలవోకగా తీసుకువచ్చింది కాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంవత్సర కాలంపాటు సమాజంలోని అన్నివర్గాలతో చర్చోపచర్చలు చేసిన తర్వాత, వివిధ వర్గాలకు చెందిన మేధావులతో మాట్లాడి తీసుకువచ్చిన కార్యక్రమమని చెప్పారు. చక్కగా, పకడ్బందీగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్లాన్ చేశారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల్లో దేశంలో చాలా ప్రభుత్వాలు వచ్చి పోయినప్పటికీ దళితజాతి మేలు కోసం ఎవరూ ఆలోచించలేదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా దళితబంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్లతో కలిసి 223 మందికి వివిధ రకాల యూనిట్లు అందించారు. దళితబంధు లబ్ధిదారులనుద్దేశించి నేతలు ప్రసంగించారు.
అనేక ప్రభుత్వాలు అనేక స్కీములు అమల్లోకి తెచ్చినా… దళితుల కోసం ఏవేవో చేసినట్లుగా చెప్పుకుంటున్న ఈరోజుకు కూడా గ్రామాల్లో పేదవాళ్లు ఎవరున్నారంటే దళితులేనని ఈ సందర్భంగా మంత్రి వేముల వివరించారు. గత ప్రభుత్వాల తీరుతో దళితుల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందన్నారు. గతంలో దళితులకు భూపంపిణీ చేసినప్పుడు ఇచ్చింది అర ఎకరం, లేదంటే ఎకరం భూ మినని అది కూడా సాగు యోగ్యం కానివేనన్నారు. వ్యవసాయం చేసుకోలేని స్థితిలో అమ్ముకునే పరిస్థితి చూశామన్నారు. తెలంగాణ రాక మునుపు వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన లోన్లతో బ్రోకర్గాళ్లకే మేలు జరిగిందని, లబ్ధిదారులకు ఒరిగిందేమీ లేదన్నారు.
లోన్ లక్షా లేదంటే 2లక్షలుంటే ఇందులో సబ్సిడీ 50శాతం, మిగిలిన 50శాతం లబ్ధిదారుడు భరించే దుస్థితి ఉండేదన్నారు. ఇలాంటి స్కీములతో 100 మందికి లోన్లు వస్తే బాగుపడ్డోళ్లు పది మంది కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. స్కీముల పేరు మీద చేయి చాపుడు, బ్యాంకు దగ్గరికి పోతే వాళ్లు సతాయించుడు, మధ్యలో బ్రోకర్గాళ్ల ప్రవేశంతో లక్ష రూపాయల లోన్ కాస్తా చేతికొచ్చేది గగనమయ్యే పరిస్థితులు చూశామన్నారు. దళితుల పేరు మీద కూడా లోన్లు తీసుకున్న ఘటనలు గతంలో వెలుగు చూశాయని వివరించారు.
ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదు..
రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో దళితబంధు పథకాన్ని తీసుకురాలేదని మంత్రి చెప్పారు. అలా చేయాలంటే లక్ష రూపాయలతో ఊరందరికీ ఒకేసారి ఇవ్వొచ్చని అన్నారు. బిజినెస్ చేసుకుంటే ఎంత డబ్బు అవసరం వస్తదో ఆలోచించి దళితులకు ఈ భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఊర్ల పైసలున్నోడు రూపాయికి రూపాయి పుట్టిచ్చినట్లే దళితబంధు ద్వారా లబ్ధిదారులు కష్టపడి పైసకు పైస పుట్టించి వృద్ధిలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు.
అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ ఆలోచనలకు అనుగుణంగా దళితబంధు అమలవుతుందన్నారు. నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున 550 మందికి నిజామాబాద్ జిల్లాలో పంపిణీ అవుతుండగా 2022-23లో నిజామాబాద్ జిల్లాలో మరో 10వేల మందికి జరుగుతుందన్నారు. జిల్లాలో 52వేల మంది దళిత కుటుంబాలుంటే ఈ సంవత్సరం 10వేల మందికి వస్తుంది. వచ్చే సంవత్సరం మరో 10వేల మందికి వస్తుంది. ఆ తర్వాతి ఏడాది 20వేల మందికి ఇవ్వడం ద్వారా నాలుగో సంవత్సరం మిగిలిన వారందరికీ పథకం చేరుతుందని మంత్రి పేర్కొన్నారు.
శ్రమించండి వృద్ధిలోకి రండి..
దళితులకు ఇందిరాగాంధీ హయాంలో గుడిసె, ఇండ్లు ఇప్పిస్తే, రాళ్లు, రప్పలున్న భూమి ఇస్తే ఆమెను దేవతగా చూశారని… ఇప్పుడు కేసీఆర్ చేస్తుంది అంతకన్నా గొప్ప పనిగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అభివర్ణించారు. 70సంవత్సరాల నుంచి ఎవరెన్ని చేసినప్పటికీ దళితులుపైకి రాలేకపోయారన్నారు. ఇప్పుడు కేసీఆర్ అందిస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని వాడుకోవాలని సూచించారు. ఎప్పుడైనా గ్రామాలకు వస్తే మీ సంతోషాన్ని చూసి మేము(ఎమ్మెల్యేలు) ఆనందపడాలని చెప్పారు. అప్పుడే సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరుతుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే నియోజకవర్గానికి 2వేల మంది దళితులకు దళితబంధు రానుందని పేర్కొన్నారు. కొంత మంది రెచ్చగొడితే దళితులు రెచ్చిపోవద్దని, వాస్తవాలు గ్రహించాలన్నారు. చేతులెత్తి నమస్కరిస్తున్నా కష్టపడి దళితబంధు సాయంతో ఉన్నత స్థానానికి వచ్చి సమాజంలో గౌరవం దక్కించుకోవాలంటూ లబ్ధిదారులను కోరారు.
– బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్
బడుగు బలహీనవర్గాల దేవుడు కేసీఆర్..
అణగారిన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని 119 నియోజకవర్గాల్లో ఎలాంటి వివక్ష, అవకతవకలు లేకుండా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కేసీఆర్‌కు తన, మన భేదం లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు అమలు జరుగుతుందన్నారు. దేశంలో 40కోట్ల మంది దళితులకు కేంద్ర ప్రభుత్వం 12వేల కోట్లు కేటాయిస్తే ఒక్క తెలంగాణలోనే రూ. 17వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు.
–ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
ఆర్థికంగా ఎదగాలి..
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రూ.పది లక్షలతో మంచి యూనిట్‌ను స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారని అన్నారు. అన్ని మతాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ తదితర పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
– అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా