ఖలీల్‌వాడి, మార్చి 21: ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండవేడిమికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటితే ఉక్కపోత చికాకు తెప్పిస్తున్నది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఎండవేడిమితో కరెంటు లేకుండా ఇండ్లు, కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి నెలకొన్నది. వడగాల్పులకు ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. పగలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి వినియోగించే వస్తువులకు డిమాండ్ పెరిగి పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు భలే గిరాకీ ఏర్పడింది. పండ్లు, జ్యూస్‌లకు ప్రజలు ఎక్కువ మొత్తం వెచ్చిస్తున్నారు. మరోవైపు వేసవి కాలం ప్రారంభంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.4 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 45 నుంచి 48 డిగ్రీల గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఇలాగే ఉంటే ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు, ప్రజలకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులోకి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వదులు దుస్తులు వేసుకోవాలి. తెలుపురంగు దుస్తులు వేసుకోవడంతో వేడిమి గ్రహించదు.
ప్రతి రోజూ ఐదు నుంచి 6 లీటర్ల నీటిని తాగాలి. వీలైనంత వరకు నీడలో ఉండే ప్రయత్నం చేయాలి.
వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయినప్పుడు వెంటనే శరీరాన్ని తడిగుడ్డతో తుడిచి దగ్గరలో ఉన్న దవాఖానలో ప్రథమ చికిత్స చేయించాలి.
చంటి పిల్లలను బయటికి తీసుకువెళ్లేటప్పుడు గొడుగు, తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలి.
ఎక్కువగా చల్లని పదార్థాలను తీసుకోవద్దు. బయటి పదార్థాలను తినడంతో డయేరియాకు దారి తీ స్తుంది.
కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసం తీసుకోవాలి.
ద్రవ పదార్థ్ధాలు తీసుకోవాలి..
రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ద్రవ పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. పండ్లు, జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంతగా నీడ పట్టున ఉండాలి. రోజు కనీసం 5 నుంచి 6 లీటర్ల నీటిని తాగాలి. నల్లటి దుస్తులు ధరించొద్దు. చిన్న పిల్లలకు ఎక్కువగా ద్రవపదార్థాలను అందించాలి.
– డాక్టర్ విశాల్
ఎండలో తిరుగొద్దు..
ప్రజలు ఎండలో ఎక్కువగా తిరుగకుండా ఉండ డం చాలా మంచిది. అత్యవసరమైతే జాగ్రత్తలు పా టిస్తూ బయటికి రావాలి. ఎక్కువగా నీరు తాగడంతో డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చు. ఎండలో ఎక్కువగా తిరిగితే అలసట, నీరసం, తలనొప్పి తదితర సమస్యలు తలెత్తుతాయి.
– డాక్టర్ జలగం తిరుపతి రావు
చల్లచల్లని తుంగ
వేసవిలో ఉష్ణతాపాన్ని తగ్గించే చల్లచల్లని తుంగ వినియోగం ప్రారంభమైంది. తుంగ మొక్కకు వేడిని నిక్షిప్తం చేసుకొనే లక్షణం ఉంటుంది. రేకుల షెడ్డు, దుకాణాల ఎదుట, ఇండ్ల ముందు షెడ్ల కింద వేసవికాలం మండిపోతుంటుంది. దీని నివారణకు పైకప్పుల పై తుంగను పరుచుకుంటారు. ఇది సగానికి పైగా వేడిని కిందకు రానివ్వకుండా చేస్తుంది. అందుకే వేసవి ఆరంభం కాగానే గ్రామాల శివారుల్లో తుంగ కోస్తున్న, రేకులపై కప్పుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కమ్మర్పల్లి మండల కేంద్రం శివారులో యువకులు తుంగ పొదలను కోస్తూ కనిపించారు.
– కమ్మర్పల్లి, మార్చి 21
మేలు చేసే కీరదోస..
ఖలీల్‌వాడి, మార్చి 21:వేసవికాలం వచ్చిందంటే చాలు శరీరానికి చలువ చేసే వాటిపై జనం ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం పండ్లు, పండ్ల రసాలను తీసుకుంటున్నారు. వీటితోపాటు దోసకాయల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కీరదోస.. ఆరోగ్యానికి భరోసానిచ్చే దివ్య ఔషధం. దోసలో పుష్కలమైన పోషకాలు ఉండడంతో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడే వారి శరీరానికి నీటిని, లవణాలను అందించడంలో చక్కని పాత్ర పోషిస్తుంది. కీరదోసలో 95శాతం నీరు ఉండడంతో డీహైడ్రేషన్ సమస్య రాదు. వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లో ఏవైనా ఆకుకూరల రసంలో కలిపి జ్యూస్ తీసుకుంటే చలువ చేస్తుంది. తీవ్రమైన ఎండతో చర్మం కమిలిన చోట రాస్తే చల్లగా ఉంటుంది.
మార్కెట్లోకి పేదోడి ఫ్రిజ్
ఎండాకాలం ప్రారంభమైందంటే ప్రతి ఒక్కరికీ చల్లనినీరు కావాల్సిందే. ధనవంతులు, మధ్యతరగతి వారు రిఫ్రిజిరేటర్లోని నీరు తాగడం సర్వసాధారణం. కానీ పేదవారికి చల్లని నీరు కావాలంటే పేదోడి ఫ్రిజ్ అయిన మట్టికుండలను ఆశ్రయించాల్సిందే. ఎండలు మండుతున్న నేపథ్యంలో మార్కెట్లో మట్టికుండల విక్రయాలు జోరందుకున్నాయి. వీటి ధరలు సుమారు రూ.100 నుంచి రూ.500 వరకు పలుకుతున్నాయి. కుండలతోపాటు మట్టి గ్లాసులు, మట్టి బాటిళ్లు, రాజస్థానీ, ఆదిలాబాద్ రంజాన్లు అందుబాటులో ఉన్నాయి.
-బీర్కూర్, మార్చి 21
కొబ్బరి బొండాలకు భలే గిరాకీ..
ఇందూరు, మార్చి 21: ఎండతాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు వివిధ రకాల పానీయాలను సేవిస్తున్నారు. అందులో కొబ్బరిబొండాలు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. ఎండాకాలం మొదలుకావడంతో కొబ్బరిబొండాలకు గిరాకీ అమాంతం పెరిగింది. నిజామాబాద్ నగరంలోని మార్కెట్ నుంచి బస్టాండ్ రోడ్డులో వెలసిన కొబ్బరి బొండాల దుకాణాల వద్ద సందడి మొదలైంది. డీహైడ్రేషన్ బారినుంచి కాపాడే కొబ్బరిబొండాన్ని తాగేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు.