జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు
సంస్థాగత నిర్మాణానికి టీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం
సెప్టెంబర్ 2 నుంచి 20 వరకు కమిటీల కూర్పు
గ్రామ స్థాయి నుంచి మొదలు.. రాష్ట్ర కమిటీల దాకా..
కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, రైతు విభాగాల ఏర్పాటు
సామాజిక న్యాయం పాటించేలా కచ్చితమైన నిబంధన
తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏండ్ల కిందట ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి నేడు రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించింది. రెండు దశాబ్దాల కాలంలో స్వరాష్ట్ర లక్ష్యాన్ని సాధించుకుని బంగారు తెలంగాణకు గులాబీ అధినేత కేసీఆర్ సారథ్యంలో బాటలు పడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం ఇప్పుడు సుభిక్షమై, ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది. యావత్ దేశంలోనే ఎక్కువ మంది కార్యకర్తలతో బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్… రానున్న సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగతో గ్రామ స్థాయి కమిటీల నిర్మాణం ప్రారంభంకానున్నది. సెప్టెంబర్ 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు వరకు ప్రక్రియ జోరుగా సాగనున్నది. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. ఈ నిబంధన పాటించని కమిటీలు చెల్లుబాటు కాకుండా నిబంధనను నిర్దేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిజామాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పార్టీ జెండా పండుగ నిర్వహించనున్నారు. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 12వరకు గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం కొనసాగనున్నది. సెప్టెంబర్ 20 నాటికి జిల్లా అధ్యక్షుడి ప్రకటన, కార్యవర్గం కూర్పు పూర్తవుతుం ది. ఆ తర్వాత రాష్ట్ర కొత్త కార్యవర్గం ఎంపిక ఉంటుంది. సెప్టెంబర్ రెండో తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా పా ల్గొంటారు. రాష్ట్రంలో జాతీయ పార్టీల కన్నా మిన్నగా బలమైన పార్టీగా టీఆర్ఎస్ ఎదిగింది. వరుసగా ఏ ఎన్నికలు వచ్చినా విజయ దుందుభి మోగిస్తూ ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ రాకుండా గులాబీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. భారీ మె జార్టీతో ప్రజలంతా టీఆర్ఎస్కే వరుసగా విజయాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి లో పార్టీ శక్తిమంతంగా నిలిచే లా గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేయనున్నది. పట్టణాల్లోనూ డివిజన్ కమిటీలకు సైతం ఈసారి ప్రాధాన్యతను ఇస్తున్నది.
పక్కాగా సామాజిక న్యాయం…
రాజకీయ పార్టీ పదవుల్లో సామాజిక న్యాయం అన్నది కనీసం వినపడదు, ఎక్కడా కనిపించదు. జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల్లో నూ ఈ మాటకు చోటు ఉండదు. అనుబంధ సంఘా ల ఏర్పాటు మినహా ఆయా రాజకీయ పార్టీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కీలకమైన పదవుల్లో, కమిటీల్లో స్థానం కల్పించడం అన్నది కలలో కూడా జరుగనిది. ఆధిపత్యమంతా కొద్ది మంది కీలకమైన లీడర్ల పెత్తన మే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో మాత్రం ఇందుకు భిన్నమైన పద్ధతిని అవలంభిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. టీఆర్ఎస్ పార్టీ నియమావళి ప్రకారం ఏ కమిటీ నియమించినా అందులో క్రియాశీల సభ్యులే ఉండనున్నారు. ఏ కమి టీ చెల్లుబాటు కావాలన్నా 51శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు తప్పనిసరిగా ప్రాతినిథ్యం కల్పిస్తారు. ఒక వేళ 51శాతానికి పైగా ఆయా వర్గాలకు స్థానం లేకుంటే కమిటీలు చెల్లుబాటు కావు. బీజేపీ గడిచిన కొద్ది సంవత్సరాలుగా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అసత్యాలు ప్రచా రం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సైతం సోషల్ మీడియాకు ప్రత్యేకంగా కమిటీ వేయాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా కమిటీలు బీజేపీ మాదిరిగా కాకుండా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోనుంది. బీజేపీ సృష్టించే ఫేక్ న్యూస్‌లను బద్దలు కొట్టేలా పని చేయనుంది.
అనుబంధ కమిటీలు కూడా…
గులాబీ పార్టీకి అనుబంధ విభాగాలు పటిష్టవంతంగా పని చేస్తున్నాయి. ఇందులో కీలకంగా కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, రైతు విభాగాలు గతం నుంచి పటిష్టవంతంగా ఉన్నాయి. సంస్థాగత బలోపేతంలో భాగంగా టీఆర్ఎస్ వచ్చే నెలలో చేపట్టబోయే కమిటీల ఏర్పాటులో ఆయా విభాగాలను సైతం నియమించనున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఈ కమిటీలు పని చేయనున్నాయి. పార్టీ పదవుల కేటాయింపులు జరిగిన అనంతరం శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు వ్యవహరిస్తున్న తీరుకు భిన్నం గా ప్రజల్లోకి టీఆర్ఎస్ జెండాను మోసుకు పోయేందుకు టీఆర్ఎస్ ముఖ్య నాయకులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పి కొట్టడం, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను, కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న ప్రగతిని వివరించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడనున్నట్లు తెలుస్తున్నది.