హరితవనంగా మారిన ఇందూరు
పరిధిలోని గ్రామాల్లో మినీ ట్యాంక్బండ్లు, పార్కుల ఏర్పాటు
కోట్ల రూపాయల ఖర్చుతో నుడా అభివృద్ధి
ఖలీల్‌వాడి, ఆగస్టు 28:
నిజామాబాద్ కార్పొరేషన్‌గా ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్ 15న నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి(నుడా)ను ఏర్పాటు చేసింది. నగరంతోపాటు సమీపంలో ఉన్న పలు గ్రామాలను నుడా పరిధిలోకి తెచ్చింది. దీంతో నుడా పరిధిలోకి 72 గ్రామాలు వచ్చాయి. నిజామాబాద్ నగరంతోపాటు నుడా పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్లు ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ నుంచి డిచ్పల్లి వరకు రూ.25లక్షలతో డివైడర్ల మధ్యలో వివిధ రకాల మొక్కలను నాటారు. వాటి సంరక్షణకు రూ.10లక్షలతో ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. వేసవికాలంలోనూ మొక్కలు ఎండిపోకుండా రూ. 13.50లక్షలతో ప్రత్యేక వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో వాటికి నీరు పోసి సంరక్షిస్తున్నారు. ఫారెస్టు కార్యాలయ భవనం కోసం నుడా నుంచి రూ. 15లక్షలను అందజేశారు.
గ్రామాల సుందరీకరణలో భాగంగా కాలూరు ఊర చెరువును రూ.75లక్షలతో మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తున్నారు. ఆ పనులకు ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. గంగస్తాన్ ఫేస్-2లో చిన్నారులు ఆడుకునేందుకు, వృద్ధులు కాలక్షేపం చేసేందుకు రూ. 40లక్షలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. రూ. 35లక్షతో ఫీల్టర్ బెడ్ నిర్మాణం, రూ. 1.30 కోట్లతో నుడా పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ పనులు చేపడుతూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటితోపాటు నుడా పరిధిలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి సమీకృత కలెక్టరేట్ వరకు రూ.కోటితో డివైడర్ పనులను పూర్తి చేశారు. రూ. 1.30 కోట్లతో నుడా పరిధిలోని జాన్కంపేట్ నుంచి నవీపేట్ వరకు డివైడర్ పనులను చేపట్టారు.
అభివృద్ధే లక్ష్యం..
నుడా పరిధిలోని 72 గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయి. పార్కులు, మినీ ట్యాంక్‌బండ్ పనులు వేగంగా చేస్తున్నాం. సమీకృత కలెక్టరేట్ వరకు డివైడర్ పనులు పూర్తయ్యాయి. గ్రామాలు, పట్టణాలను తలపించేలా అభివృద్ధి పనులు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.