భవన నిర్మాణ సమాచారం మరింత కచ్చితంగా ‘భువన్’లో నిక్షిప్తం
అనుమతులు, భవన నిర్మాణ వైశాల్యం తేటతెల్లం
సగానికి పైగా నిర్మాణాల సమాచారాన్ని ఇప్పటికే నమోదు చేసిన మున్సిపాలిటీలు
నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలో జోరుగా వివరాల సేకరణ
ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీల్లో 50శాతానికి చేరిన నమోదు
ఏడు పురపాలక సంఘాల్లో మొత్తం 1,51,532 భవనాలున్నట్లు గుర్తింపు
నేటివరకు 94,961 ఇండ్లు, వ్యాపార సముదాయాల సమాచారం నిక్షిప్తంపట్టణ ప్రాంతాల్లోని నివాస భవనాలు, వ్యాపార సముదాయాల ఆస్తిపన్ను లెక్కింపులో అవకతవకలకు ఇక అడ్డుకట్ట పడనున్నది. మరింత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్మాణాలకు పన్ను మదింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ సాయం తీసుకుంటున్నది. తీసుకున్న అనుమతులకు, నిర్మిత భవనాలకు పొంతన లేకుండా ఉండే అవకాశం ఇక లేనట్టే. పురపాలకశాఖ ఆధ్వర్యంలో ఇండ్లు, వ్యాపార సముదాయాల సమగ్ర వివరాలను, కచ్చితమైన భవన నిర్మాణ సమాచారాన్ని భువన్ యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో లక్షా 51వేల 532 నివాసాలు, వ్యాపార సముదాయాలున్నట్లుగా పురపాలకశాఖ గుర్తించింది. వీటి సమగ్ర సమాచారాన్ని భువన్ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు బృందాలుగా ఏర్పడి భవన నిర్మాణాల వివరాలను పక్కాగా సేకరిస్తున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) పట్టణాలు, నగరాల్లో నివాస భవనాలు, వ్యాపార సముదాయాల నిర్మాణాలకు ఉన్న అనుమతులకు, బిల్డింగ్ నిర్మాణానికి పొంతనే ఉండదు. ఆస్తి పన్ను లెక్కింపు సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో ఉంటే ఆ తర్వాత పైఅంతస్తులు నిర్మించినప్పటికీ మిగిలిన దానిపై పన్ను కట్టేదే లేకుండా పోయింది. నిజామాబాద్ నగరంలోనైతే కార్పొరేషన్ సిబ్బందికి మామూళ్లు ఇస్తే వాటి జోలికి కూడా పోరు. ఇదే తంతు మిగిలిన మున్సిపాలిటీల్లోనూ కొనసాగుతున్నది. ఆస్తి పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా సందట్లో సడేమియాలు మాత్రం తమ జేబుల్లో అక్రమ సంపాదనను నింపుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్యాప్‌ను గుర్తించింది. మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణాలను క్షేత్రస్థాయికి వెళ్లి సేకరించాలని ఆదేశించింది. ఇందుకోసం భువన్ పేరిట ఓ యాప్‌ను రూపొందించింది. ఇందులో నివాస గృహంతోపాటు వ్యాపార, వాణిజ్య సముదాయాల నిర్మాణ వైశాల్యం, వాటి ఫొటోలు పొందుపరుస్తున్నారు. తాజాగా సేకరిస్తున్న భవనాల కొలతల ప్రకారం ఆస్తి పన్నును మున్సిపాలిటీలు విధించనున్నాయి. ప్రభుత్వానికి గండి పడుతోన్న ఆదాయం ఇప్పుడు ఖజానాకు చేరనున్నది. అక్రమార్కుల ఆటలకు చెక్ పడనున్నది.
పెరుగనున్న ఆదాయం..
భువన్ యాప్‌తో పురపాలికల ఆదాయం పెరుగనున్నది. మున్సిపాలిటీ పరిధిలో కొందరు ఇంటి నిర్మాణానికి ఒకటి, రెండు అంతస్తుల వరకే అనుమతి తీసుకొని బహుళ అంతస్తులు నిర్మించారు. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు పన్ను చెల్లించడం లేదు. పురపాలక అధికారులు ఇప్పుడు నేరుగా ఇంటికే వెళ్లి కొలతలు తీసుకుంటున్నారు. నిర్మాణ వాస్తవ పరిస్థితిని గుర్తిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మించిన వాటికి జరిమానాతో పన్ను వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఆస్తి పన్ను విధించేందుకు సిబ్బందే కొలతలు చేపట్టేవారు. పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా జరగకపోవడంతో పెద్ద పట్టణాలు ఉన్నా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం భువన్ యాప్‌లో పురపాలికను బట్టి నాలుగు నుంచి ఆరు డివిజన్లుగా విభజించారు. ఇందులో స్థానిక సబ్ రిజిస్ట్రార్ల ప్రకారం పురపాలికల్లో ప్రాంతం, స్థలం మేరకు ధరలను పరిగణలోకి తీసుకుని పన్ను నిర్ణయించారు. సర్వేలో భాగంగా ఇంటి నిర్మాణం, ఎన్ని అంతస్తులు, సౌకర్యాలు, విస్తీర్ణం, గృహమా, వ్యాపార, వాణిజ్య సముదాయమా అనే వివరాలు నమోదు చేయడంతోపాటు భవనానికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేసి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత అందుకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లోనూ కనిపించనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే నమోదు చేసిన వివరాల ఆధారంగా ఆస్తి పన్ను విధించే అవకాశం ఉంది.
ఫొటో తీసి, కొలతలు నమోదు చేసి..
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఇండ్లు, వ్యాపార సంస్థలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నాలుగు, కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. వివరాల నమోదు ప్రక్రియ నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో జోరుగా జరుగుతున్నది. ఆర్మూర్, బోధన్, భీంగల్‌లో వివరాలు సేకరించడంలో పురపాలక సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రెండేండ్ల క్రితం పురపాలికల పరిధిలోని ఇండ్లకు సంబంధించిన ఫొటోలు పురపాలికల్లో నిక్షిప్తం చేశారు. ఈ రెండింటినీ అనుసంధానం చేసేలా భువన్ యాప్‌ను రూపొందించారు. తాజాగా పురపాలికల్లోని సమగ్ర సమాచారం సేకరించి యాప్‌లో నమోదు చేసేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇండ్లు, వ్యాపార సంస్థలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే వివరాలు సేకరిస్తున్నారు. పురపాలికల్లో రెవెన్యూతోపాటు పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల సమన్వయంతో ఇండ్లు, వ్యాపార సంస్థలను వేర్వేరుగా గుర్తిస్తున్నారు. మొబైల్ ద్వారా ప్రతి భవనం ఫొటోలు తీసి వాటికి అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తున్నారు. మరోవైపు భవనానికి సంబంధించిన పన్ను చెల్లిస్తున్నారా లేదా అనే వివరాలను సైతం గమనిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి…
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీలున్నాయి. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఉంది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో లక్షా 51వేల 532 నివాసాలు, వ్యాపార సముదాయాలున్నట్లుగా పురపాలక శాఖ లెక్కించింది. వీటిని భువన్ యాప్‌లో ఎక్కించాలని ఆదేశాలు జారీ కావడంతో ఆయా పురపాలక సంఘాల్లో బృందాలుగా ఏర్పడి భవన నిర్మాణాల వివరాలు పక్కాగా సేకరిస్తున్నారు. పాత లెక్కల స్థానంలో కొత్త కొలతల వివరాలను నమోదు చేసి నష్టాన్ని పూడ్చుతున్నారు.
గడువులోగా పూర్తిచేస్తాం..
భువన్ యాప్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేస్తున్నాం. ప్రభుత్వం విధించిన గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. వచ్చే నెల 15లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించింది. మరో 15రోజులు అదనంగా పొడిగింపు ఇవ్వనున్నారని తెలిసింది. ఆ సమయం వరకు పూర్తి చేస్తాం.
మున్సిపల్ కమిషనర్, బోధన్ వేగంగా ప్రక్రియ..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భువన్ యాప్‌లో ఆస్తుల వివరాలను పొందుపరుస్తున్నాం. నివాసానికి సంబంధించిన ఫొటోలు, వైశాల్యం, నల్లా కనెక్షన్, ఎన్ని అంతస్తులు తదితర వివరాలను నిక్షిప్తం చేస్తున్నాం. ఇప్పటి వరకు 2,118 ఇండ్ల వివరాలను నమోదు చేశాం. మిగిలిన 2,510 నివాసాల నమోదును త్వరలోనే పూర్తి చేస్తాం.
15 రోజుల్లో నమోదు పూర్తి..
ఈ నెలాఖరు వరకు భువన్ యాప్‌లో ఆస్తుల వివరాలను నమోదు చేయించాలని ఆదేశాలున్నాయి. కానీ సీజనల్ వ్యాధుల నివారణ, పాఠశాలల్లో శానిటైజేషన్‌కు సిబ్బందిని కేటాయించడంతో ఆలస్యమవుతున్నది. వచ్చే నెల 15 వరకు 100 శాతం ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం.
-జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్
అక్రమాలకు అడ్డుకట్ట
భువన్ యాప్‌లో పట్టణంలోని ప్రతి నివాసపు కొలతలు తీసుకుంటున్నాం. ఆస్తి పన్ను, నీటి కనెక్షన్‌కు సంబంధించి, ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్టయిజ్మెంట్, సెల్టవర్ల వివరాలను భువన్ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నాం. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. సెప్టెంబర్ 15 వరకు వివరాల నమోదు పూర్తి చేస్తాం.