గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని
ఎంపీపీ, ఎంపీడీవో తీరుపై నిరసన
లింగంపేట, ఆగస్టు 26: ఎంపీటీసీ సభ్యులకు ఎంపీపీ, ఎంపీడీవోలు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, వారి తీరుకు నిరసనగా మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీ సభ్యులు బహిష్కరించారు. ఎంపీపీ గరీబున్నీసా బేగం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు హాజరుకాలేదు. ఎంపీటీసీలు సమావేశానికి రాకుండా ఎంపీపీ చాంబర్లో కూర్చున్నారు. ఎంపీపీ గరీబున్నీసా, ఎంపీడీవో శంకర్‌నాయక్‌తో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. మండలంలో నిర్వహించే కార్యక్రమాలకు ఎంపీటీసీ సభ్యులను పిలవడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. జడ్పీసీఈవో సాయాగౌడ్ బాణాపూర్ గ్రామాన్ని బుధవారం సందర్శిస్తే ఎందుకు సమాచారం ఇవ్వలేదని వైస్ ఎంపీపీ ప్రశ్నించారు. మండలంలో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీవో శంకర్‌నాయక్‌ను ప్రశ్నించగా.. 12 స్థానాలు ఉన్నాయని చెప్పారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 12 అని చెప్పడంపై ఎంపీటీసీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు గడుస్తున్నా ఎంపీటీసీ సభ్యులను గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలానికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించాని నిరసన వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించిన వారిలో వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రూప్సింగ్, దేవేందర్, సర్వన్, శమీమున్నీసా బేగం, ఇందిర, ఆకుల సురేందర్, తులసీబాయి, కమ్మరి కల్యాణి, మన్నె భాగవ్వ, వెంకటి, సామ్‌ని తదితరులు ఉన్నారు.