రాష్ట్రంలో మక్కబుట్టలకు ఏకైక మార్కెట్ ఇదే..
జిల్లా నలుమూలల నుంచి మక్కజొన్న రాక
ఏటా సీజన్లో రూ.కోట్లల్లో కంకుల వ్యాపారం
దేశంలోని పలు ప్రాంతాలకు ఇక్కడినుంచే ఎగుమతిఎకరానికి రూ.50వేల ఆదాయం.. పలువురికి ఉపాధి
వానకాలంలో కోట్ల రూపాయల్లో పచ్చిమక్కబుట్టల వ్యాపారం
జిల్లా నలుమూలల పంటల అమ్మకాలు ఇక్కడే..
ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి
పరోక్షంగా చాలా మందికి ఉపాధి
నిజామాబాద్ జిల్లాలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్ పచ్చి మక్కబుట్టల మార్కెట్‌గా గుర్తింపు పొందింది. రాష్ట్రంలోనే ఏకైక పచ్చి మక్కబుట్టల మార్కెట్‌గా నిలిచింది. పచ్చిమక్క బుట్టలను..మక్క కంకులుగా, మక్కజొన్న పొత్తులుగా, మక్కెండ్లుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. ఆర్మూర్ డివిజన్లోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రైతులు వేల ఎకరాల్లో మక్క పంటను ఏటా సాగు చేస్తున్నారు. పచ్చి మక్కబుట్టల అమ్మకాలు జరిపేందుకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన రైతులు అంకాపూర్‌కు తరలివస్తుంటారు. మక్కబుట్టలను ట్రాక్టర్లు, ఆటో ట్రాలీల సహాయంతో అంకాపూర్ మార్కెట్‌కు తరలించి విక్రయాలు జరుపుతున్నారు. మరికొందరు తమ పంట దిగుబడిని గుత్తాగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో ఆటో ట్రాలీ పచ్చి మక్కబుట్టలను 3వేల నుంచి రూ.5,500 వరకు అమ్ముతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఆటో ట్రాలీలో సుమారు 1100 నుంచి 1300 వరకు పచ్చి మక్కబుట్టలుంటాయి. ఎకరానికి పది ఆటో ట్రాలీల పచ్చి మక్కబుట్టలు వస్తాయని, దీంతో సుమారు రూ.50వేల ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్లో సైతం పచ్చి మక్కబుట్టలను కిలోకు రూ.9 చొప్పున రైతులు వ్యాపారులకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు.
పలు రకాలుగా ఉపాధి..
అంకాపూర్ మార్కెట్లో పచ్చి మక్కబుట్టలతో పలువురు ఉపాధి పొందుతున్నారు. మక్కలను కాల్చి విక్రయించడంతోపాటు బుట్టలతో వడలను తయారు చేస్తున్నారు. అంకాపూర్లోని జాతీయ రహదారికి ఇరువైపులా నిత్యం 25 మంది మక్కబుట్టలను కాల్చి, విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. కాల్చిన మక్కబుట్టను రూ.10 చొప్పున అమ్ముతుంటారు. వీరితోపాటు మక్క వడల దుకాణాలను ఏర్పాటు చేసుకొని ప్లేట్‌కి రూ.20 చొప్పున విక్రయిస్తూ పలువురు ఉపాధి పొందుతున్నారు.
దేశంలోని పలు రాష్ర్టాలకు ఎగుమతి..
జిల్లాలో పచ్చి మక్కబుట్టల మార్కెట్‌కు ప్రసిద్ధి అయిన అంకాపూర్‌లో చిరుజల్లులు పడి వాతావరణం చల్లగా ఉంటే ఒక ధర, పొడి వాతావరణం ఉంటే మరో ధర లభిస్తుందని రైతులు చెబుతున్నారు. అంకాపూర్ మార్కెట్ నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని, మెదక్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాలతోపాటు దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ర్టాలకు పచ్చి మక్కబుట్టలు ఎగుమతి అవుతున్నాయి. వ్యాపారులు రైతుల వద్దకు వచ్చి పచ్చి మక్కబుట్టలను కొనుగోలు చేసి లారీలు, వ్యాన్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఎకరానికి 50వేలు వస్తాయి..
ఆటో ట్రాలీ నిండా పచ్చి మక్కబుట్టలకు రూ.4వేల నుంచి రూ.5,500 వరకు ధర పలుకుతుంది. బాగా పండితే ఎకరానికి 8 నుంచి 10 ఆటోట్రాలీల పచ్చి మక్కబుట్ట వస్తుంది. ఎకరానికి సుమారు రూ.50వేల ఆదాయం వస్తుంది. కాత సమయంలో వర్షం కురిస్తే ధర పెరిగి మరింత ఆదాయం వస్తుంది.
అంకాపూర్లోని పచ్చి మక్కబుట్టలతో రోజూ 35 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కొందరు పచ్చి మక్కబుట్టలను కాల్చి అమ్ముతుంటారు. మరికొందరు వడలుగా చేసి విక్రయిస్తారు. రైతులకు, వ్యాపారులకు, కార్మికులకు ఆదాయం అందిస్తున్నది అంకాపూర్ మార్కెట్.
-కేకే భాజన్న, రైతు, గురడిరెడ్డి సంఘం
మాజీ కార్యదర్శి, అంకాపూర్
మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేయిస్తా..
నేను సర్పంచ్‌గా ఉన్న అంకాపూర్‌లో రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన పచ్చి మక్కబుట్టల మార్కెట్ ఉండడం సంతోషం. మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేయిస్తా. రైతులు, వ్యాపారుల కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వసతులు కల్పిస్తాం. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారంతో గ్రామానికి వన్నె తెచ్చేలా అభివృద్ధి పనులు చేయిస్తా.