ఈ సీజన్లో ఇప్పటి వరకు 142.589 టీఎంసీల చేరిక
ప్రాజెక్టుకు నిరంతరంగా కొనసాగుతున్న వరద
ఆగస్టులోనే మూడుసార్లు గేట్ల ఎత్తివేత
స్సారెస్పీకి ఈ నెలలో 22.921 టీఎంసీల ఇన్‌ఫ్లో
ఎస్సారెస్పీకి సాధారణంగా భారీగా వరద వచ్చేది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే. కానీ మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి జూలైలోనే వరదనీటితో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సీజన్ ప్రారంభం నుంచి వరద కొనసాగుతూనే ఉన్నది. జూలై చివరి నాటికే ప్రాజెక్టులోకి మొత్తం 119.6 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో గత నెలలో ప్రాజెక్టు 35 గేట్లను ఎత్తి మూడురోజులపాటు మిగులు జలాలను గోదావరి లోకి వదిలారు. ఆగస్టు నెలలోనూ 25 రోజుల్లో 19 రోజులు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. దీంతో మూడు సార్లు గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేశారు. ఇన్‌ఫ్లో కొనసాగిన 19 రోజుల్లో సరాసరి రోజుకు 1.22 టీఎంసీల వరద ప్రాజెక్టును చేరింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 142.6 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా.. 70.7 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.
కమ్మర్పల్లి, ఆగస్టు 25 : మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో అనతి కాలంలోనే నిండు కుండలా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రెండున్నర నెలలుగా వరద కొనసాగుతూనే ఉన్నది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి స్వల్పంగానో, భారీగానో వరద కొనసాగిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ప్రాజెక్టు ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో నిండుతుంది. కానీ తొలిసారి జూలైలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. మిగులు జలాలు భారీగా దిగువకు వదిలేంతగా జూలైలో వరద కొనసాగింది. ఇదిలా ఉండగా ఆగస్టు మా సం కూడా ఎప్పటిలాగే ఈ సీజన్‌కు కూడా జల సంబురాన్ని అందించింది. ఈ మాసంలో మరో వారం రోజులు మిగిలి ఉండగానే 22.921 టీంఎసీల వరద ప్రాజెక్టుకు వచ్చింది.
ప్రారంభం నుంచే ఆశాజనకంగా
ఎస్సారెస్పీలోకి ఆశాజనక వరద ప్రారంభం కావడం, ఆశాజనకంగా నీటి మట్టాలు నమోదు కావడం ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లోనే జరుగుతూ వస్తున్నది. దీంతో ఈ మాసాలు ప్రాజెక్టుకు ఆశాజనక సెంటిమెంటు మాసాలుగా నిలుస్తూ వస్తున్నాయి. ఈ మాసాల కోసం సీజన్ ప్రారంభం నుంచి ఆయకట్టు రైతులు ఎదురు చూస్తూ వస్తారు. కానీ ఈ సారి జూలైలోనే ప్రాజెక్టు పూర్తిగా నిండి పోయింది. ఈ వానకాలం ప్రారంభం నుంచి జూలై 31 వరకే ప్రాజెక్టులోకి మొత్తం 119.668 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు 35 గేట్లను ఎత్తి మూడు రోజుల పాటు మిగులు జలాలను గోదావరి లోకి వదిలారు.
జూలైలోనే ఇంతలా వరద రావడం, మిగులు జలా లు దిగువకు వదలడంతో ఆగస్టు మాసంలో వరద రాక మీద ఎదురు చూపులు అవపసరం లేకుండా పోయాయి. కానీ సెంటిమెంటు మిస్ కాకుండా ఆగస్టులోనూ వరద రాక బాగానే సాగింది.ఈ నెల లో గడిచిన 25 రోజుల్లో 19 రోజులు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగింది. ఈ నెల 1,2,4,5,6,7వ తేదీలు మినహా మిగతా రోజుల్లో ఇన్‌ఫ్లో కొనసా గింది. ఈ నెలలో ఇన్‌ఫ్లోలు కొనసాగిన 19 రోజు ల్లో సరాసరి రోజుకు 1.22 టీఎంసీల వరద ప్రా జెక్టుకు వచ్చింది.ఈ 19 రోజుల్లో మొత్తం 22.921 టీఎంసీల వరద వచ్చిది. దీంతో ఈ ఆగస్టులోనే మూడు సార్లు గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఈ నెల 19 న ఏడు గేట్లు, 22న ఆరు గేట్లు, 25న నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ ఇన్‌ఫ్లోలను బట్టి ఈ ఆగస్టు సైతం ప్రాజెక్టుకు ఎప్పటిలానే సెంటిమెంటుగా.. గత జూలై మాసంలో సాగిన వరద జోరుకు కొనసాగింపుగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ వానకాలం మొదలు నుంచి ప్రాజెక్టులోకి వచ్చిన వరదలను బట్టి ఇప్పటి వరకు ప్రాజెక్టు సీజన్ నిరంతర వరదల సీజన్‌గా మిగిలిపోనున్నది.
ఎస్సారెస్పీ నాలుగు గేట్ల ఎత్తివేత
మెండోరా (ముప్కాల్), ఆగస్టు 25 : ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో బుధవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 21,580 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. నాలుగు గేట్లను ఎత్తి 12,480 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు. జెన్కోకు 7,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 180, సరస్వతీ కాలువకు 800, గుత్ప ఎత్తిపోతలకు 135, ఆలీ సాగర్ ఎత్తిపోతలకు 360 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు)కాగా బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉంది. గత సంవత్సరం ఇదే రోజున ప్రాజెక్టులో 1088.90 అడుగుల(79.301టీఎంసీ) నీటినిల్వ ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 142.589 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా 70.713 టీఎంసీల నీటిని బయటికి వదిలారు.