సరిహద్దులో వంతెన కష్టాలు..
బోధన్ – నాందెడ్ అంతర్రాష్ట్ర రహదారిపై మంజీర బ్రిడ్జికి పగుళ్లు
భారీ వాహనాల రాకపోకలు నిషేధం
కొత్త వంతెన నిర్మాణం తప్పనిసరి అని తేల్చిన ఇంజినీర్లు
పట్టించుకోని మహారాష్ట్ర సర్కార్
మహారాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం కారణంగా వాహనాలు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని సాలూరా సమీపంలో తెలంగాణ- మహారాష్ట్రను కలిపేందుకు 35 ఏండ్ల కిందట మంజీరపై నిర్మించిన వంతెనకు పగుళ్లు ఏర్పాడ్డాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ వంతెనను ఏడాది కిందట అక్కడి ఇంజినీర్లు పరిశీలించి.. తక్షణమే వాహనాల రాకపోకలను నిలిపివేయాలని, దీని స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని సిఫార్సు చేశారు. వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.188.69 కోట్లు మంజూరు చేయనున్నట్లు నాలుగు నెలల క్రితం ప్రకటించినప్పటికీ అందులో పురోగతి లేదు.
బోధన్, ఆగస్టు 21: తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో నిజామాబాద్ జిల్లాలోని సాలూరకు సమీపంలో మంజీరా నదిపై ఉన్న పెద్ద వంతెన ప్ర మాదంలో పడింది. ఆ వంతెనకు పగుళ్లు రావడం తో అది ప్రమాదపుటంచుల్లో ఉంది. ఐదేండ్లుగా ఈ వంతెనకు క్రమంగా పగుళ్లు వస్తున్నాయి.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ వంతెనకు కొద్దిపాటి మరమ్మతులు చేశారే తప్ప.. పూర్తిస్థాయిలో వంతెన ఆధునీకరణ జరగలేదు.. ఏడాది కిందట ముంబైకి చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ఈ వంతెనను పరిశీలించి.. తక్ష ణం ఈ వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయాలని, ఈ వంతెన స్థానంలో కొత్తగా వంతెన నిర్మించాలని సిఫార్సు చేసింది. దీంతో మహారాష్ట్ర సర్కార్‌లో ఒకింత చలనం వచ్చింది. పెద్ద వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించింది. ఈ వంతెనకు సమాంతరంగా ఎప్పుడో వందేండ్ల కిందట నిజాం కాలంలో నిర్మించిన పాత వంతెన కు కొద్దిపాటి మరమ్మతులు చేపట్టి.. ఈ వంతెనపై అప్ప టివరకు వాహనాల రాకపోకలపై ఉన్న నిషే ధం ఎత్తివేసింది. పెద్ద వంతెనపై నుంచి 20 టన్నులకు మించి బరువున్న వాహనాలపై నిషేధం విధించారు. కేవలం కార్లు, జీపులు, ఇతర చిన్న వాహనాలను మాత్రమే ఈ వంతెనపైకి అనుమతిస్తున్నారు. ఇక, పెద్ద పెద్ద లారీలు, బస్సులు తదితర భారీ వాహనాలు చిన్న వంతెనపై నుంచే వెళ్తున్నా యి. సమీపంలో ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో ప్రమాదకరంగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఇటు తెలంగాణను, అటు మహారాష్ట్రను కలుపుతూ మంజీరా నదిపై పెద్ద వంతెన ను 35 సంవత్సరాల కిందట నిర్మించారు. మూడున్నర దశాబ్దాల కిందట నిర్మించిన ఈ కొత్త వంతెన శిధిలావస్థకు చేరగా… ఎప్పుడో నిజాం కాలంలో రాతికట్టడంగా నిర్మించిన పాత వంతెన ఇప్పటికీ మనుగడలో ఉండడమే కాకుండా భారీ వాహనాల రాకపోకలకు వారధిగా ఉండడం విశేషం.. అయి తే, శిథిలావస్థలో ఉన్న ఈ పాత వంతెన ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర సర్కార్ ఐదేండ్లుగా రెండు రాష్ర్టాల మధ్య కీలకమైన వంతెన నిర్మాణం విషయమై పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఏమిటీ ఈ వంతెన ప్రాధాన్యత
మంజీరా నదిపై పురాతన వంతెనకు ప్రత్యామ్నాయంగా రెండు రాష్ర్టాలను కలుపుతూ ఈ భారీ వంతెన నిర్మాణం 1986లో పూర్తయింది. అప్పట్లో ఈ వంతెనను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఖానాల మధ్య వంతెన స్లాబ్ పలకలను, బాల్స్లాంటి నిర్మాణాలపై నిలబెట్టడం ద్వారా ఈ వంతెన నిర్మాణం జరిగింది. భారీ వాహనాలకు సైతం వంతెన దెబ్బతినకుండా ఉండేందుకు స్ప్రింగ్ యాక్షన్ ఉండేలా నిర్మించారు. నది మధ్యభాగంలో సుమారు 50 అడుగుల ఎత్తు ఉం టుంది. ఈ వంతెనను 1986లో సాలూరా శివారులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మహారాష్ట్ర సీఎం ఎస్బీ చవాన్ సంయుక్తంగా ప్రా రంభించారు. ఈ వంతెనను అప్పట్లో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. అందులో అప్పటి మన రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర కోట్ల రూపాయలను మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది. రాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో మహారాష్ట్రలోని బిలోలి, ధర్మాబాద్ తదితర తా లూకాల్లో చాలా భూములు ముంపునకు గురవుతాయని అంచనా వేశారు. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌తో మంజీరా నదికి ఇరువైపులా రవాణా సంబంధాలు తగ్గిపోతాయని భావించారు. దీంతో మహారాష్ట్రకు వంతెనల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది రూపాయలను పరిహారంగా ఇచ్చింది. ఆ నిధులతోనే ఈ మంజీర వంతె న నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ వంతెన ద్వా రా మన రాష్ట్రంలోకి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యా నా సరుకుల లారీలు వస్తుంటాయి. వంతెన దాటి మన రాష్ట్రం వాహనాలతో పాటు ఏపీ, తమిళనా డు, ఒరిస్సా తదితర రాష్ర్టాల లారీలు వెళ్తుంటాయి. ఈ విధంగా… ఈ వంతెన వివిధ రాష్ర్టాల మధ్య ఒక వారధిగా ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ధ్వంసమవుతున్న చారిత్రాత్మక చిన్న వంతెన
మంజీరపై పెద్ద వంతెన నిర్మాణానికి ముందు పురాతనమైన చిన్న వంతెనపై నుంచే రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు జరిగేవి.
ఈ వంతెన వయస్సు ఇప్పటికీ సుమారు వంద సంవత్సరాలు ఉంటుంది. పెద్ద వంతెన నిర్మాణంతో చిన్న వంతెన పైనుంచి వాహనాలు రాకపోకలు నిలిచిపోయా యి. దీంతో ఇదో చారిత్రక చిహ్నంగా మిగిలింది. ఈ వంతెనను ఆనకట్టగా మార్చాలని, తద్వారా చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన ఇటు మన రాష్ట్రంలోనూ, అటు మహారాష్ట్రలోనూ ఉంది. ఈ మాటెలా ఉన్నా… ఈ చిన్న వంతెనను గత కొన్నేండ్లుగా ఇసుకాసురులు ధ్వంసం చేస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు ఈ చిన్న వంతెనపై నుంచే భారీ వాహనాలు వెళ్తుండడంతో త్వరలోనే ఈ వంతెన మరింతగా శిథిలమయ్యే ప్రమాదం ఏర్పడింది.
కొత్త వంతెన నిర్మాణానికి రూ.188.69 కోట్ల మంజూరు..
మంజీర నదిపై కొత్త వంతెన నిర్మాణం కోసం కేం ద్ర ప్రభుత్వం రూ.188.69 కోట్లు మంజూరుచేయనున్నట్లు నాలుగు నెలల కిందట కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ ట్విట్టర్లో ప్రకటించారు. అయితే, ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు.. మహారాష్ట్ర పరిధిలో ఉన్న ఈ వంతెన నిర్మాణం విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు.
సరిహద్దు దాటేందుకు కష్టాలు
మంజీర పెద్ద వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉండడంతో ఇరు రాష్ర్టాల మధ్య జరిగే సరుకు ల రవాణాకు ఇబ్బందులు తప్పడంలేదు. చిన్నవంతెన పై చిన్న లారీలు, బస్సులు మాత్రమే తిరుగుతున్నా యి. సుమారు 800 మీటర్ల పొడవు ఉన్న ఈ చిన్న వం తెనపై ఒకేసారి రెండు పెద్ద వాహనాలు ఎదురెదురుగా ప్రయాణించలేవు.. పైగా, పాత వంతెన లోలెవల్ బ్రిడ్జి కావడంతో మంజీరకు ఏమాత్రం వరద వచ్చినా.. రాకపోకలు నిలిచిపోతున్నాయి. పాత వంతెనకు ఆనుకుని మంజీర ప్రవహించే సమయాల్లో ఈ వంతెనపై ప్రయాణమంటే ప్రమాదాలను కొనితెచ్చుకోవడమే.గత నెలలో సుమారు నాలుగైదు రోజులపాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఇకనైనా కొత్త వంతె న నిర్మాణానికి మహారాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.