పశువుల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్న భూలక్ష్మీక్యాంప్ రైతులు
ప్రతి ఇంటి ముందూ పాడి బర్రెలు
నిజామాబాద్ వరకూ పాల సరఫరా
ప్రతి ఇంటి ముందూ బర్రెలు
ఒక్కో బర్రెతో రోజుకు రూ.500 ఆదాయం
పశువుల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్న భూలక్ష్మి క్యాంప్ రైతులు
ఒకప్పుడు బోధన్ మండలంలోని సాలంపాడ్‌క్యాంప్, పెంటకుర్దు క్యాంప్ గ్రామాలంటేనే పాడీ పంటలకు నెలవుగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అదేస్థాయిలో చాలా గ్రామాలు పా డి, పంటలతో కళకళలాడుతున్నాయి. అందులో ముఖ్యంగా భూలక్ష్మిక్యాంప్.. బోధన్ మండలంలోనే అతి చిన్న గ్రామాల్లో రెండోది. భూలక్ష్మిక్యాంప్లో సుమారు 800 జనాభా నివసిస్తుంటారు. వందలాది ఎకరాల భూములు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. యాసంగి, వానకాలంలో పంటలు సమృద్ధిగా సాగవుతాయి.
పంటలతోనే పాడి పశువుల పెంపకం..
భూలక్ష్మిక్యాంప్లో యాసంగి, వానకాలంలో రెండు పంటలను పండిస్తారు. ఇక్కడ ప్రధానమైన పంట వరి. అయితే రైతులు పంటలతోపాటు పశువులను కూడా పెంచుతుంటారు. ఇక్కడ ఏ ఇంటిని చూసినా ఒక పాడి బర్రె కచ్చితంగా ఉంటుంది. ఒక్కో రైతు రెండు నుంచి మూడు బర్రెలను పెంచుతుంటారు. అవి ఇచ్చిన పాలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. గ్రామానికి చెందిన చాలా మంది రైతులు పాలను సేకరించి నిజామాబాద్‌కు సరఫరా చేస్తుంటారు. వీటి ద్వారా వారం, వారం ఆదాయం సంపాదిస్తున్నారు.
పుష్కలంగా పశువుల మేత..
గ్రామంలో ఎక్కువగా వరి సాగు చేస్తుండడంతో పశువుల మేతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు సొప్ప, పిల్లిపిసదు లాంటి రొట్ట మేత పంటలను సాగు చేస్తూ పశువులను మేపుతున్నారు. దీంతో పశువులు బాగా పాలు ఇస్తున్నాయి. పాలల్లో చిక్కదనం ఉండడంతో లీటరు పాలకు రూ.45 నుంచి 50 వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఒక్కో బర్రె ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు నాలుగు లీటర్ల చొప్పున రోజుకు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుంది. దీంతో ఒక బర్రె ద్వారా రూ.500 నుంచి 600 సాధిస్తున్నామని చెబుతున్నారు. వ్యవసాయం కన్నా పాడి పెంపకంలో అధిక ఆదాయం పొంది మండలంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆ గ్రామం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరం. అక్కడ ఏ ఇంటిని ముందు పాడి గేదెలు కనిపిస్తాయి. ఓ వైపు వ్యవసాయం చేసుకుంటూనే పాడి పోషణతో ఇక్కడి రైతులు ఆర్థిక పురోగతి సాధిస్తున్నారు. పంట సాగులో కన్నా పాడి పరిశ్రమతోనే అధిక ఆదాయం సాధిస్తున్నామని చెబుతున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భూలక్ష్మి క్యాంప్ రైతులు.
పశువులే మాకు జీవనాధారం..
పశువులే మాకు జీవనాధారంగా మారాయి. మాకు ఐదు పశువులు ఉన్నాయి. ప్రస్తుతం రెండు బర్రెలు పాలు ఇస్తున్నాయి. ఎప్పుడూ వాటి బాగోగులు చూసుకుంటూ ఉంటాం. రోజూ పాల ద్వారా మంచి ఆదాయం వస్తున్నది. దీంతోపాటు పంటలూ పండిస్తున్నాం.
పశువులే ఆదాయ వనరు…
మాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. సంవత్సరానికి రెండు పంటలు పండిస్తుంటాం. కానీ, పంట కంటే పశువుల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నది. ఉన్న నాలుగు బర్రెల్లో రెండు పాలు ఇస్తుంటాయి. వాటి ద్వారా మంచి ఆదాయం వస్తున్నది.