ఎన్హెచ్-44పై డిచ్పల్లి నుంచి ఇందూరు వరకు..
15కిలోమీటర్ల దూరం.. 20వేల మొక్కల పెంపకం
నుడా కృషితో రహదారికి కొత్త అందాలు
పంచాయతీరాజ్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో..
డిచ్పల్లి, ఆగస్టు 19 : ఇందూరు నగరపాలక సంస్థగా మారి దశాబ్దం గడిచింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటయ్యింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఇది ఎన్ఎంసీ పరిధికన్నా విస్తృతమైనది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మొక్కల హరితహారం నుడాకు అదనపు హారంగా మారింది. నుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాలను మొక్కల పెంపకం ద్వారా పచ్చదనాన్ని సంతరింపజేస్తున్నారు. పంచాయతీ రాజ్, అటవీశాఖల సమన్వయంతో 44వ జాతీయ రహదారి(నాగ్పూర్ గేట్) నుంచి మొదలుకొని బోర్గాం(పీ) వరకు ఉన్న సుమారు 15 కిలోమీటర్ల మేర రహదారిపై డివైడర్ల మధ్య, రహదారికి ఇరువైపులా మొక్కలు పెంచుతున్నారు. రహదారి వెంట సుమారు 20 వేలకుపైగా వివిధ రకాల మొక్కలను నాటారు. వీటిని సిబ్బంది, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
రకరకాల మొక్కలు…
రహదారి వెంట నాటిన మొక్కల్లో వివిధ జాతులకు చెందినవి ఉన్నాయి. వీటిలో సాధారణ మొక్కలతోపాటు పూల మొక్కలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా రాగి, మద్ది, కోలాకర్పన్, విటోడియా, పటోడియాతోపాటు వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల ద్వారా నుడాకు, అటవీ, పంచాయతీరాజ్ శాఖలకు సరఫరా చేశారు. నుడా పైరెండు శాఖల సమన్వయంతో రహదారి వెంట మధ్యలో ఉన్న డివైడర్లర్లో నాటిన మొక్కలను సంరక్షిస్తున్నది. మూడు విభాగాల అధికారులు ప్రస్తుతం మొక్కల పెంపకాన్ని చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికనుగుణంగా మొక్కల పెంపకం సాగుతున్నది.
సీఎం ఆదేశాలతో…
గతంలో సీఎం కేసీఆర్ పలుమార్లు పర్యంటించిన సందర్భాల్లో నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ నుడాను ఏర్పాటు చేయాలని, తద్వారా దాని పరిధిలోకి వచ్చే ప్రాంతాలను పట్టణ ప్రాంత వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలతో రూరల్ ఎమ్మెల్యే గోవర్ధన్, అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నాగ్పూర్ గేట్ నుంచి నిజామాబాద్ నగర సమీపం వరకు రహదారిని విస్తరించారు. నుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కలుపుతూ రహదారి వెంట వేలాదిగా మొక్కలను పెంచుతున్నారు.
దీంతో నాగ్పూర్ గేట్ నుంచి ఇందూరు పచ్చతోరణంగా మారుతుందనడంలో సందేహం లేదు. సీఎం కేసీఆర్ ఇందూరు పర్యటనకు వచ్చే సమయానికి పూర్తిస్థాయిలో పచ్చదనం అగుపించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కంటికి రెప్పలా కాపాడుతున్నాం..
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగానే మొక్కలను నాటాం. వాటిని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. సిబ్బంది ద్వారా నిరంతరం నీటిని పట్టిస్తున్నాం. రహదారిపై ఉన్న డివైడర్లపై నాటిన మొక్కల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లా ఉన్నతాధికారులు కూడా తరచూ పర్యవేక్షణ చేస్తున్నారు.
-మర్రి సురేందర్, ఎంపీడీవో
మొక్కల పెంపకం మా బాధ్యత..
ప్రస్తుతం ఉన్న అడవులు అంతరించిపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో చేపడుతున్న మొక్కల పెంపకంలో మా విభాగం కూడా భాగం అయినందుకు సంతోషకరంగా ఉంది. మొక్కల పెంపకం అనేది మా బాధ్యతగా భావిస్తున్నాం. అందుకనుగుణంగా పచ్చదనం మరింతగా పెరిగేలా కృషి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతాం.
-హిమచందన, ఎఫ్ఆర్వో