శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏడు వరద గేట్లను ఎత్తిన అధికారులు
ఎస్సారెస్పీలోకి భారీగా వరద
61వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల
నిజాంసాగర్‌లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
సింగీతం వరద గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకుతోడు విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీకి భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఏడు వరద గేట్లను ఎత్తిన అధికారులు.. ప్రాజెక్టు నుంచి 21,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు నిజాంసాగర్, సింగీతం రిజర్వాయర్లలోనూ భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.
ఏడు వరద గేట్ల ద్వారా 21,840 క్యూసెక్కుల విడుదల
మెండోరా, ఆగస్టు 19: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాలనుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో వరద గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి గురువారం రాత్రి 9.30 గంటలకు ఈఈ చక్రపాణి ఆధ్వర్యంలో ఏడు వరద గేట్లను ఎత్తి 21,840 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఉదయం నుంచి ప్రాజెక్టులోకి 39వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతూ మధ్యాహ్నానికి 45 వేల క్యూసెక్కులకు నీరు క్రమంగా పెరిగింది. రాత్రికి ఒక్కసారిగా 61,600 క్యూసెక్కుల వరద రావడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ఎగువ నుంచి వచ్చే వరద నీటిని గేట్లతో దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఈఈ చెప్పారు. గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు(90.313 టీఎంసీలు) కాగా గురువారం రాత్రి 1090.30 అడుగుల(86.5 టీఎంసీలు) వద్ద ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నిజాంసాగర్‌లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
నిజాంసాగర్, ఆగస్టు 19: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) ఉండగా.. గురువారం సాయంత్రానికి 1397.66 అడుగుల (9.02 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ఎగువప్రాంతం నుంచి 1358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు తెలిపారు. సింగీతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం(416.55 మీటర్లు)తో కళకళలాడుతున్నది. ఎగువ ప్రాంతం నుంచి 655 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. మూడు వరద గేట్ల ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.