ప్రైవేటు నుంచి ‘ప్రవేశాల’ ప్రవాహం
సంక్షోభ సమయంలో అండగా నిలుస్తున్న ప్రభుత్వం స్కూళ్లు
ఫ్రైవేట్లో చదువుకు ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రుల సతమతం
ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి
ఆన్లైన్ ద్వారా నాణ్యమైన బోధన
2021-22లో ఉమ్మడి జిల్లాలో 8265 మంది విద్యార్థుల చేరిక
నిజామాబాద్లో 5881, కామారెడ్డిలో 2384 మంది
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల పేరిట వేధింపులు
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా జనజీవనం అతలాకుతలంగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు, చిరుద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాసంస్థలు వరుసగా మూతపడడంతో ప్రాథమికస్థాయి విద్యాబోధన గందరగోళంలో పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మెరుగైన బోధన అందిస్తుండగా.. క్షేత్రస్థాయిలో జిల్లా, మండల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేటులో తరగతులు లేకపోయినప్పటికీ యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు వసూలు చేయడంతో చాలామంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ బడులు వారి పిల్లలను అక్కున చేర్చుకుంటున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 8265 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం గమనార్హం.
నిజామాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా వైరస్ ఏడాదిన్నర కాలంగా వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు, చిరు ఉద్యోగులను కకావికలం చేసింది. విద్యా సంస్థలు వరుసగా మూత పడడంతో ప్రాథమిక, ప్రాథమికోతన్నత విద్య గందరగోళంలో పడింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మేలు చేకూర్చే నిర్ణయాలను అమలు చేస్తున్నాయి. సర్కారు బడుల్లో ఆన్లైన్ పాఠాల ద్వారా విద్యార్థుల సమయాన్ని సద్వినియోగం పరుస్తోంది. ప్రైవేటులో పరిస్థితి దిగజారిపోయింది. భౌతికంగా తరగతులు నడవకపోవడంతో అంతా అయోమయంగా మారింది. తరగతులు లేకపోయినప్పటికీ యాజమాన్యాలు బలవంతం గా ఫీజులు వసూలు చేయడం వంటి నిర్ణయాలు కొన్ని కుటుంబాలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వ బడులు వారందరికీ చుక్కానిలా నిలుస్తున్నాయి. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రైవే టు బడుల నుంచి సర్కారు స్కూళ్లకు ప్రవేశాలు ప్రారంభం కావడంతో 2021-22 విద్యా సంవత్సరంలో వేల సంఖ్యలో చేరుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఆన్లైన్ విధానంలో అర్థవంతం గా పాఠాలు నడిచే విధంగా విద్యాశాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది.
వేల సంఖ్యలో ప్రవేశాలు…
కొన్నాళ్లుగా ప్రజల చూపు ప్రైవేటు పాఠశాలలపై ఉండేది. కరోనా వారి జీవితాలను ఒక్కసారిగా మార్చేసింది.18 నెలుగా ప్రజల ఆర్థిక స్థితిగతులు దిగజారిపోయాయి. దీంతో కనీసం పిల్లలను చదివించుకునే స్థోమత చాలా మందికి లేకుండా పోయింది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఫలితంగా సర్కారు బడుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. వారి నమ్మకాన్ని పెంచేలా విద్యాశాఖ ఆన్లైన్ తరగతులను పకడ్బందీగా నిర్వహిస్తోంది. ప్రవేశాలకు గడువు ఉన్నందున మరింత మంది చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు వస్తున్నట్లు వారు చెబుతున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చి చేరారు. ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 5881 మంది, కామారెడ్డి జిల్లాలో 2,384 మంది పిల్లలు వివిధ తరగతుల్లో ప్రవేశాలు పొందడం గమనార్హం. పలు ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలు మూత పడడం కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక కార్యాచరణతో విద్యా శాఖ ముందుకెళ్తున్నది. ఆన్లైన్ తరగతులను పర్యవేక్షిస్తూనే బడుల్లో సదుపాయాలు, నాణ్యమైన విద్యపై ప్రచారం చేస్తున్నారు.
ఆన్లైన్ పాఠాలు…
నిజామాబాద్ జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 20,047 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. వీరిలో ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చిన వారే 5,881 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 2021-22లో 1-10 తరగతుల్లో మొత్తం 15,687 మంది ప్రవేశాలు పొందగా వీరిలో కేవలం ప్రైవేటు నుంచి ఫీజుల మోతకు ప్రభుత్వ బడులకు వచ్చిన వారు 2,384 మంది ఉండడం విశేషం. ఏడాదిన్నర కాలంగా ప్రత్యక్ష తరగతులు నడవకపోవడం ఒక కారణమైతే, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులకు కూడా మొత్తం ఫీజులను ముక్కు పిండి వసూలు చేయడం మరో కారణం. ముఖ్యంగా 1, 2 తరగతులకు ఎలాంటి బోధన జరగకపోయినా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హాజరు శాతం వేసి పై తరగతులకు పంపాలంటే కచ్చితంగా ఫీజులు కట్టాలన్న నిబంధనలు విద్యార్థుల తల్లిదండ్రులకు తలనొప్పిగా మారా యి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ప్రైవేటు ఫీజులు తాళలేక చాలా మంది సమీప గ్రామా ల్లో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలు చేర్పించడంతో విద్యా శాఖ సైతం ప్రవేశాల సమయంలో కొన్ని నిబంధనలను సరళతరం చేసింది. టీసీ నిబంధనల సడలింపు కారణంగాచాలా మంది సర్కారు స్కూళ్లలో చేరడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.
అందుబాటులో వనరులు వాడుకుంటూ…
ఆన్లైన్ లైవ్ పాఠాలు ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకే పరిమితమయ్యాయి. కొందరు ఉపాధ్యాయుల చొరవతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నేరుగా పాఠాలు వింటున్నారు. సందేహాలను అప్పటికప్పుడే నివృత్తి చేసుకుంటున్నారు. డిజిటల్ తరగతులతో పాఠాలు వినడమే తప్ప ఉపాధ్యాయులతో మాట్లాడే అవకాశం ఉండదు. అర్థమైనా కాకపోయినా పట్టించుకునే వారుండరు. నష్టపోతున్న విద్యార్థుల పరిస్థితిని గుర్తించిన జిల్లాలోని కొన్ని సర్కారు బడుల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి చదువుకు అండగా నిలుస్తున్నారు. జూమ్ యాప్, వీడియో పాఠాలు, యూట్యూబ్ చానళ్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదేశించకపోయినా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నారు. కరోనా మూలంగా దెబ్బతిన్న అనేక సామాన్య కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇంకా రెండు నెలల పాటు ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ప్రతీది బలవంతంగా కొనాల్సిందే. అదే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ కల్పిస్తున్న విషయాలను విద్యా శాఖ ప్రచారం చేస్తోంది.
పకడ్బందీగా ఆన్లైన్ పాఠాల బోధన
ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులకు తట్టుకోలేక చాలా మంది ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు బాగున్నాయి. అందులో ప్రైవేటు నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంకా అడ్మిషన్లకు అవకాశం ఉండడంతో మరింత మంది చేరే అవకాశాలున్నాయి. సర్కారు బడుల్లో ప్రవేశాలకు నిబంధనలను ప్రభుత్వం సడలించింది. టీసీ నిబంధన లేకపోవడం తల్లిదండ్రులకు వెసులుబాటును కల్పించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్లోపాఠాల బోధన పకడ్బందీగా నిర్వహిస్తున్నాం.
ప్రభుత్వ బడులకు పెరుగుతున్న ఆదరణ
ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది పోలిస్తే భారీగా ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు. సర్కారు అందిస్తున్న ప్రయోజనాలతో సర్కారు బడుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతున్నది.