డిచ్పల్లి, ఆగస్టు 16: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం నిరుపేద దళిత కుటుంబాలు స్వయం సమృద్ధిని సాధించడానికి దోహదపడుతుందని వక్తలు పేర్కొన్నారు. ఈ పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు విరజిమ్ముతాయన్నారు. ప్రభుత్వ పథకాలు బడు గు, బలహీన వర్గాలు అభ్యున్నతి సాధించడంలో కీలకంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలోని సెమినార్ హాలులో తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిశోధన అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘దళితబంధు- ప్రగతిపథం’ అనే అంశంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వీసీ డి.రవీందర్గుప్తా హాజరై మాట్లాడారు. ఏ వర్గమైనా ఆర్థిక ఎదుగుదలతోనే ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటుందన్నారు. ఆర్థిక స్వావలంబనతోనే జీవన ప్రామాణికతలను పెంపొందించుకోగలుగుతామని అన్నారు. ఆర్థిక సమానత్వాన్ని సాధించినప్పుడే ఏ ప్రాంతమైనా సమగ్ర ప్రగతిని పొందుతుందన్నారు. డాక్టర్ అంబేద్కర్ భావజాల మూలాంశంగా అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కీలకంగా నిలుస్తున్నాయని అన్నారు. హుజూరాబాద్ తర్వాత నిజామాబాద్లో కూడా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కోరారు. ఈ పథకం ద్వారా టీయూలోని దళిత విద్యార్థులకు పరిశోధనా వనరులు అందించే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత పరిశోధక విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధిని సాధించేందుకు ఇది చక్కని అవకాశమన్నారు. నానో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్ సైన్స్ వంటి అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానంతో దళిత పరిశోధకులు ఈ దళితబంధు వనరుల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఆడిల్ సెల్ డైరెక్టర్ ఆచార్య పి.కనకయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలం నుంచి దళితులు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విద్యా వైద్య, రాజకీయ ప్రతిఫలాలను పొందుతున్నారన్నారు. అంబేద్కర్ స్మృతి పథం నుంచి మరొక పథకం అట్టడుగు వర్గాల వికాసానికి కార్యరూపం దాల్చుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’లో వంద అంశాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. దళితులకు నిరుద్యోగ భృతిని అందించి ఆర్థిక ప్రగతి, బంగారు భవిష్యత్తు కల్పించడం కోసం ఈ పథకంలో విధానాలు సరిపోతాయన్నారు. విద్యా, వైద్యానికి సంబంధించిన పనులతోపాటు అనేక అంశాలలో జీవన నైపుణ్యాలను సముపార్జించడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందవచ్చన్నారు. స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి వెళ్లిపోయిన పూర్వ విద్యార్థులకు జీవనభృతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. భవిష్యత్తులో దళితులకు నాణ్యమైన విద్య, ఆర్థిక సమానత్వం గల సమాజాన్ని అందించగలుగుతామని అన్నారు. దళితుల సమస్యలు తెలుసుకొని ఈ పథకం అర్హులైన వారికి అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. దళితుల ఆర్థిక ఆత్మగౌరవానికి ప్రతీకగా దళితబంధును స్వాగతిస్తున్నామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ పి.సంపత్ అధ్యక్షత వహించగా, ప్రిన్సిపాల్ డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ బి.నాగరాజు, బి.అంజయ్య, డాక్టర్ జమీల్, త్రివేణి, బీకోజీ, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పాతనాగరాజు, ఆచార్యులు ఎ.నాగరాజు, బాలకిషన్, మహేందర్రెడ్డి, ఉమారాణి, ఖవి తదితరులు పాల్గొన్నారు.